మూడు టీ20ల సిరీస్‌కు అదిరిపోయే ముగింపు.. టిక్కెట్ల కోసం అష్టకష్టాలు పడి ఎలాగో స్టేడియంలోకి వెళ్లిన ప్రేక్షకులతో పాటు టీవీల్లో తిలకించిన వీక్షకులకు కూడా ఈ పోరు ఉర్రూతలూగించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఆదివారం ఉప్పల్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), విరాట్ కోహ్లీ (48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63) కీలక అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. దీంతో నిర్ణాయక మ్యాచ్‌లో గెలిచిన భారత్ 2-1తో సిరీస్ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), కామెరూన్ గ్రీన్ (21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించారు. అక్షర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసి నెగ్గింది. హార్దిక్ (25 నాటౌట్) ఆకట్టుకున్నాడు. సామ్స్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా సూర్యకుమార్, మ్యాన్ ఆఫ్ ద సిరీ్‌సగా అక్షర్ పటేల్ నిలిచారు.