విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. ఆదాయం చూపించి రుణాలు తీసుకున్నారు. పంచాయతీలు, విద్యా సంస్థల నిధులనూ లాక్కొన్నారు. ఇప్పుడు సర్కారు కన్ను సముద్ర తీరంపై పడింది. ఖాళీగా ఉన్న బీచ్‌లు, పక్కనే ఉన్న భూములను తన పరిధిలోకి తీసుకుంటోంది. రాష్ట్రంలో 900 కిలో మీటర్లకు పైగా తీరప్రాంతం ఉంది. ఆ మేరకు తీరం వెంబడి గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. బీచ్‌ల వెంట ఏం చేయాలన్నా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాలి. అంతేగాక ప్రత్యేకంగా సీఆర్‌జెడ్ అనుమతులు తీసుకోవాలి.
అలాగే సముద్రానికి, గ్రామానికి మధ్య ఉండే భూమిని తీసుకోవాలన్నా, అక్కడ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు చేపట్టాలన్నా తప్పనిసరిగా అనుమతులు ఉండాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలు చెప్పకుండా సముద్రానికి, గ్రామాలకు మధ్య ఉండే భూములను నేరుగా తన పరిధిలోకి తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ సర్వే, సరిహ ద్దుల చట్టం-1923లోని సెక్షన్ 5 కింద బీచ్‌లున్న భూములను గ్రామాల పరిధిలోకి తీసుకొస్తూ ప్రత్యేకంగా వాటికి సర్వే నంబర్లు కేటాయిస్తోంది.
నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే పేరుపాలెంలోని భూమిని సర్కారు మే నెలలో ఎవరికో కేటాయించింది. ఆ వివరాలను గోప్యంగా ఉంచారు. నిబంధనల ప్రకారం ఆ భూ మికి మొదట సర్వే నంబర్ కేటాయించాలి. ఆ తర్వాతే సర్కారు కేటాయించాలి. అయితే ఉత్తర్వును పరిశీలిస్తే ముందే కేటాయింపులు చేసి ఆ తర్వాత సర్వే నంబర్ కేటాయించినట్లుగా ఉంది. ప్రభుత్వం తన పరిధిలో ఉన్న భూముల విషయంలో ముందస్తు పొజిషన్, కేటాయింపులు ఇచ్చిందంటే అర్థం ఉంది. బీచ్‌ల్యాండ్ విషయంలో ఎందుకు ఈ తొందరపాటును ప్రదర్శించింది? తెరవెనుక ఏం జరిగి ఉంటుంటి? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.