పోలీసులపై పగ తీర్చుకున్న ఒక లైన్ మేన్


అప్పటివరకు వెలుగులు చిమ్ముతున్న  సదరు పోలీస్ స్టేషన్
ఒక్కసారిగా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. విషయం వారికి అర్థమయ్యేసరికి.. ఈ లైన్ మ్యాన్ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీ లోని షామ్లీకి చెందిన లైన్ మ్యాన్ కు హెల్మెట్ లేకుండా వాహనం మీద వెళుతున్నందుకు భారీ ఫైన్ వేయటం.. కోపంతో పోలీస్ స్టేషన్ కు కరెంటు కనెక్షన్ ను తీసేసిన వైనం షాకింగ్ గా మారింది. లైన్ మేన్ కోపం దెబ్బకు సదరు పోలీస్ స్టేషన్ లో దాదాపు రాత్రంతా చీకట్లోనే గడిపిన వైనం షాకింగ్ గా మారింది.


హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాన్ని నడిపిన ఉదంతంలో విద్యుత్ శాఖలోని లైన్ మెన్ కు పోలీసులు భారీగా ఫైన్ వేశారు. తాజాగా అతగాడికి హెల్మెట్ లేదని రూ.6వేలు ఫైన్ వేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు లైన్ మేన్.. ఆన్ లైన్ లో సదరు పోలీస్ స్టేషన్ ఉన్న బకాయిల్ని టెస్టు చేశారు.


ఆన్ లైన్ లో పోలీస్ స్టేషన్ విద్యుత్ బకాయిల్ని చెల్లించలేదన్న విషయాన్ని గుర్తించిన సదరు లైన్ మేన్.. ఆ సమాచారాన్ని తన ఉన్నతాధికారులకు అందజేశారు.దీంతో.. పోలీస్ స్టేషన్ విద్యుత్ కనెక్షన్ ను తొలగించాల్సిందిగా సదరు లైన్ మేన్ కు ఆదేశాలు జారీ చేసింది. అంతే.. ఆలస్యం చేయని సదరు లైన్ మ్యాన్.. స్టేషన్ కు సమీపంలోని పోల్ ఎక్కేసి.. పోలీస్ స్టేషన్ కనెక్షన్ కట్ చేశాడు. పోలీసులు ఏం చేస్తారన్న విషయాన్ని పట్టించుకోకుండా.. కోపంతో అతగాడి నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.