పెడనలో సీఎం సభ ప్రారంభం కాకుండానే జనం వెనుతిరిగి వెళ్లడం కనిపించింది. సీఎం సభ ప్రకటించిన సమయానికంటే కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవైపు వ్యాన్లు, బస్సుల్లో జనాన్ని లోపలికి పంపిస్తుండగా, మరోవైపు నుంచి కొందరు బయటకు వెళ్లడం కనిపించింది. సీఎం వచ్చాక కూడా ఆయన ప్రసంగం వినకుండానే కొందరు వెళ్లిపోయారు. సీఎం ప్రసంగం రుచించక మరి కొందరు వెళ్లిపోవడం గమనార్హం. కాగా, ఈ సభలో సీఎం ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనన్న ఆశతో ఎదురు చూసిన చేనేత కార్మికులకు నిరాశే ఎదురయింది.
చేనేత సమస్యలన్నింటికీ నేతన్న నేస్తమే పరిష్కారమన్నట్లుగా ఆయన ప్రసంగం సాగడం, చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల ప్రస్తావన లేకపోవడంపై నేతన్నలు పెదవి విరిచారు. సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత సంఘాలను బయటపడేస్తానన్న హామీ కూడా సీఎం నోట రాలేదు. తమకూ నేతన్న నేస్తం వర్తింపజేస్తామని సీఎం ప్రకటిస్తారేమోనని ఆశతో ఎదురుచూసిన అనుబంధ వృత్తుల కార్మికులకు నిరాశ మిగిలింది. సభ నుంచి వెళ్లిపోతున్న ప్రేక్షకులను వైసీపీ కార్యకర్తలు లోపలకు పంపేందుకు ప్రయత్నాలు చేసినా.. సీఎం ప్రసంగం చప్పగా సాగడం, ఎండ తీవ్రత కారణంగా జనం చివరి వరకు ఉండకుండా వెనుదిరిగారు.