దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు చాలా మంది కుమారులు కూతుళ్లు. అందరినీ మంచిగానే ఎన్టీఆర్ సెటిల్ చేశాడు. అటు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా.. ఇటు ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్.. కొడుకులు కూతుళ్లకు ఆస్తులు అంతస్తులు మంచి సంబంధాలు ఇవ్వడంలో వెనుకాడలేదు. కూతుళ్లను ఏరికోరి మంచి సంబంధాలు వెతికి మరీ పెళ్లి చేశాడు. అయితే ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమా మహేశ్వరి (52) తాజాగా ఆత్మహత్య చేసుకోవడం నందమూరి ఫ్యామిలీతోపాటు అభిమానుల్లో విషాదం నింపింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో ఉరివేసుకుని ఉండొచ్చని కుటుంసభ్యులు చెబుతున్నారు. ఉమామహేశ్వరి.. తన భర్త శ్రీనివాసప్రసాద్‌తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 9లో నివాసముంటున్నారు. శ్రీనివాసప్రసాద్ వైద్యుడు కాగా.. ఉమామహేశ్వరి గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె విశాల భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమార్తె దీక్షిత వివాహం ఇటీవలే జరిగింది. ఉమామహేశ్వరి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో.. ఆమెను చూసేందుకు చిన్న కుమార్తె దీక్షిత తన భర్తతో కలిసి రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చారు.సోమవారం శ్రీనివాసప్రసాద్ పని మీద బయటకు వెళ్లారు. ఉమామహేశ్వరి, దీక్షిత, ఆమె భర్త కలిసి ఉదయం టిఫిన్ చేశారు. అనంతరం ఉమామహేశ్వరి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు.
మధ్యాహ్నం భోజనానికి రావాలంటూ తల్లిని పిలిచేందుకు దీక్షిత ఆమె బెడ్‌రూం తలుపు కొట్టగా.. లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేదు. తలుపు పగులకొట్టి చూడగా ఉమామహేశ్వరి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించారు. కిందకు దించి చూసినా.. అప్పటికే మరణించినట్టు తేలింది. దీక్షిత ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మరోవైపు.. ఉమామహేశ్వరి మరణవార్త తెలియగానే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్, బాలకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా.. శాంతంగా ఉండేవారని, ఆమె మరణం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని చంద్రబాబు అన్నారు. అమెరికాలో ఉన్న ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అక్కణ్నుంచీ బయల్దేరారు. ఆమె మంగళవారం సాయంత్రానికి నగరానికి చేరుకోనున్నారు. బుధవారం ఉదయం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కాగా.. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. ఉస్మానియా మార్చురీలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి.. ఆమె భౌతికకాయాన్ని సోదరుడు బాలకృష్ణకు అప్పగించారు.