టాలీవుడ్‌లో సమ్మె గంట మోగింది.. నిర్మాతలే బంద్‌కి దిగడం విచిత్రం.


టాలీవుడ్‌ చరిత్రలోనే ఇదే తొలిసారేమో..? చి
త్రసీమలో సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. అందరూ కలిసి, చర్చించుకొని, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకొని, సమస్యని పరిష్కరించుకొంటారు. అది కుదరని పక్షంలో బంద్‌లు తప్పవు. అయితే ఇప్పటి వరకూ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సినీ కార్మికులు సమ్మె చేస్తే.. ఇప్పుడు ఏకంగా నిర్మాతలే బంద్‌కి దిగడం విచిత్రం.ఇది వరకెప్పుడూ లేనంతగా హీరోల పారితోషికాలు పెరిగిపోయాయన్నది నిజం. 

గతంలో ఓ కథానాయకుడు పది కోట్ల పారితోషికం అందుకొంటున్నాడంటే అంతా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు టూ టైర్‌ హీరోలు సైతం అవలీలగా పది కోట్లు పలుకుతున్నారు. బడా హీరోల సంగతి చెప్పాల్సిన పనిలేదు. పాన్‌ ఇండియా హీరోగా పేరు తెచ్చుకొన్న ప్రభాస్‌ పారితోషికం వంద కోట్లకు పైనే. మహేష్‌ బాబు దాదాపుగా రూ.60 కోట్లు అందుకొంటున్నారు.  అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌... వీళ్లంతా రూ.50 కోట్లు దాటేశారు.ఓ అగ్ర దర్శకుడు మల్టీస్టారర్‌ రూపొందించాడు. ఆ సినిమా బడ్జెట్‌ దాదాపుగా రూ.150 కోట్లు. హీరోలిద్దరూ.. దాదాపుగా రూ.50 కోట్ల పారితోషికం అందుకొన్నారు. తీరా చూస్తే సినిమా ఫ్లాపు. రూ.150 కోట్లు పెట్టి తీసిన ఆ సినిమాకి థియేటర్ల నుంచి రూ.10 కోట్లు కూడా రాలేదు. ఇలాంటప్పుడు ఆ నిర్మాత పరిస్థితి ఏంటి?ఈమధ్య పాన్‌ ఇండియా మత్తులో మునిగిపోయారు నిర్మాతలు. 

ఫలానా హీరో సినిమా.. హిందీలో తెగ ఆడేసింది అనేసరికి.. తమ సినిమాకీ అలాంటి డిమాండే ఉంటుందనుకొని, పాన్‌ ఇండియా ట్యాగ్‌ లైన్‌తో సినిమాలు మొదలెడతారు. పాన్‌ ఇండియా స్థాయిలో వచ్చే రాబడిని ఊహించుకొని విపరీతంగా ఖర్చు చేస్తారు. తీరా చూస్తే.. ఆ సినిమా సొంత భాషలో కూడా ఆడదు. ప్రతి సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘పుష్ప’ కాదు కదా? తమ సినిమానో, హీరోనో ఎక్కువ ఊహించుకోవడం వల్ల.. నిర్మాతలు భారీగా నష్టపోవాల్సివస్తోంది. ఓ సినిమా హిట్టవ్వగానే హీరోలు పారితోషికం పెంచేయడం మామూలే. అయితే.. ఆ హీరోకి అంత ‘వాల్యూ’ ఉందా, లేదా? అని లెక్క వేయగల సామర్థ్యం నిర్మాతకు ఉండాలి.