కోటి ఆంకాక్షల మూట... కావాలి పూదోట
జాతీయ జెండా ఆవిష్కరించి, అమరవీరులను స్మరించుకున్న జనసేన నేతలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరిగాయి. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి, అమరవీరుల స్తూపం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం, యువజన విభాగం అధ్యక్షులు శ్రీ వంగా లక్ష్మణ్ గౌడ్, వీరమహిళ విభాగం అధ్యక్షులు శ్రీమతి మండపాక కావ్య, వీర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి శిరీష, విద్యార్ధి విభాగం నాయకులు శ్రీ గోకుల రవీంద్రరెడ్డి, శ్రీ రామకృష్ణ, సీనియర్ నాయకులు శ్రీ దామోదర్ రెడ్డితో పాటు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ శంకర్ గౌడ్ మాట్లాడుతూ... “ ఎందరో పోరాటాలు, మరెందరో ఆత్మ బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం కోసం జనసేన పార్టీ తుద వరకు పోరాటం చేస్తుంది. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ర్టం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క అమరవీరుడికి జోహార్లు అర్పిస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో సమస్యలపై పోరాటానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని” చెప్పారు.
మిగతా పార్టీలకు ధీటుగా జనసేన జెండా ఎగరవేస్తాం : శ్రీ రాధారం రాజలింగం*
గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం మాట్లాడుతూ... “ ఈ రోజు చాలా అపురూపమైన రోజు. నాలుగు కోట్ల మంది ఆంకాక్ష అయిన ప్రత్యేక తెలంగాణను సాధించుకున్న రోజు. ఎన్నో పోరాటాలు, మరెన్నో ప్రాణ త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తిని ప్రజా సమస్యల పరిష్కారంలోనూ కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్టీలకు ధీటుగా జనసేన జెండాను ఎగరవేస్తామని” అన్నారు.
*తెలంగాణ స్ఫూర్తిని కొనసాగిస్తాం*
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి జనసేన నాయకులు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తితో జనసేన పార్టీ బలోపేతానికి జిల్లాలో కృషి చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మచ్చ కిరణ్ గౌడ్ పిలుపునిచ్చారు. వేడుకల్లో జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కిరణ్ గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు శ్రీ మహేష్, శ్రీ గణేష్, శ్రీ రాజేష్, శ్రీ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్టేషన్ ఘన్ పూర్ లో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ విద్యార్థి, యువజన నాయకులతో కలిసి జనసేన పార్టీ రాష్ర్ట నాయకులు శ్రీ గాదె పృధ్వీ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ యూత్ సెక్రెటరీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాసరి పవన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీ సైదాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బైంసా పట్టణంలోని ఐలమ్మ గద్దె వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.