ఏపీ ప్రభుత్వం జిల్లాల విభజన, పేర్లు వంటి విషయాల్లో ఎక్కడా ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వలేదన్నారు జనసేనాని. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల విభజన లోపభూయిష్టంగా సాగిందని ఆరోపించారు. అసలు ఎప్పటి నుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదన్నారు.
అసలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంలో ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలలో ఏ ఒక్కరి నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకోలేదన్నారు పవన్. అయితే ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన తీసుకొంటుందని చెప్పారు. ఇక ఇప్పటికే కర్నూలు జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరుని పెడతామని ఇప్పటికే జనసేనాని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేసిన అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేశామని మంత్రి సజ్జల చెప్పిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలను నవ్యాంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టారు. తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన శాఖల జిల్లా అధికారులు కూడా కొన్ని నిముషాల్లోనే తమ బాధ్యతల్లోను తీసుకున్నారు.