నాన్నబుడ్డితో అమ్మఒడిని ముడిపెట్టిన సర్కారు


మద్యం అమ్మి పిండుకునే ఆదాయాన్నే..
అమ్మఒడి పథకానికి నగదుగా అందిస్తున్నారు అంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. కానీ వెటకారంగా చేసిన ఈ వ్యాఖ్యనే రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసింది. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే అమ్మఒడి పథకాన్ని అమలుచేస్తామని స్పష్టంచేసింది.

మద్యం షాపుల నుంచి బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చేరే డబ్బును నేరుగా ఆ ఖాతాకు పంపేందుకు సన్నద్ధమైంది. అమ్మఒడితోపాటు డ్వాక్రా మహిళల పాత రుణాల చెల్లింపుల కోసం పెట్టిన ఆసరా, మహిళల కోసం పెట్టిన మరో పథకం చేయూతను కూడా మద్యం ఆదాయంతోనే అమలుచేస్తామని వెల్లడించింది. దీంతో ‘మాకొద్ద’న్న మద్యమే ఇప్పుడు జగన్‌ ప్రభుత్వానికి కీలకంగా మారినట్టయింది.


ఇందుకోసం ఇప్పటికే ఎక్సైజ్‌ చట్టానికి కొన్ని సవరణలు చేయగా, తాజాగా కొత్తగా విధించిన స్పెషల్‌ మార్జిన్‌ను నేరుగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చేర్చేలా మరోసారి సవరణ చేసింది. అమ్మఒడి, ఆసరా, చేయూత పథకాల అమలుకోసం ఇటీవల రూ.వెయ్యి కోట్ల నగదును బేవరేజెస్‌ కార్పొరేషన్‌..గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు బదిలీ చేసింది. త్వరలో మరింత నగదును ఆ శాఖకు బదిలీ చేయనుంది. గతంలో ఈ నగదును ప్రభుత్వ ఖజానాకు పంపేవారు. ఇప్పుడు పథకాల అమలుకోసం ప్రభుత్వ ఖజానాతో సంబంధం లేకుండా నేరుగా సచివాలయాల శాఖకు నగదు బదిలీ చేసే విధానాన్ని ప్రారంభించింది. అక్కడ నగదు సిద్ధంగా ఉంచి సీఎం ఆయా పథకాలకు బటన్‌ నొక్కిన వెంటనే సచివాలయాల శాఖ ఆ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సవరణలు తీసుకొచ్చింది.