ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన సభ తొలిరోజే అందరూ ఊహించనిట్లే టీడీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. 2022, మార్చి 07వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన సభలో గవర్నర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అంతలోనే టీడీపీ సభ్యులు లేచి ఆందోళనలు, నినాదాలతో హోరెత్తించారు.
గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకొనేందుకు వారు ప్రయత్నించారు. ఏకంగా వెల్ లోకి దూసుకొచ్చిన సభ్యులు పేపర్లు చించి విసిరేశారు. దీంతో గవర్నర్ ఏమి మాట్లాడుతున్నారో అర్థం తెలియని పరిస్థితి నెలకొంది.అసెంబ్లీ సమావేశాలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
తొలుత సభకు రావొద్దని అనుకున్న టీడీపీ.. మూడు రాజధానులపై కోర్టు తీర్పుతో సభకు హాజరు కావాలని నిర్ణయించింది. చంద్రబాబు మినహా మిగిలిన టీడీపీ సభ్యులంతా సభకు హాజరవుతారు. మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఈ సమావేశాల్లో టీడీపీ-వైసీపీ మధ్య మరోసారి తీవ్ర వ్యాగ్యుద్ధం జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.