డిజిటల్‌ రూపీ


న్యూఢిల్లీ: 
దేశీయ కరెన్సీ త్వరలో డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి రానుంది. ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలకు దీటుగా చట్టబద్ధమైన డిజిటల్‌ రూపాయిని ఆర్‌బీఐ ఏప్రిల్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. గడిచిన కొన్నేళ్లలో భారత్‌లోనూ బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలకు ఆదరణ పెరిగింది. ప్రధానంగా యువ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వీటిలోకి గణనీయంగా పెరిగాయి. కానీ, చట్టబద్ధత లేని, మనీలాండరింగ్‌ వంటి అక్రమ కార్యకలాపాలకు ప్రధాన మార్గంగా మారిన క్రిప్టోలపై ఆర్‌బీఐ సహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. క్రిప్టోలకు ప్రత్యామ్నాయంగా ఆర్‌బీఐ డిజిటల్‌ కరెన్సీని వినియోగంలోకి తీసుకువస్తోంది. 


డిజిటల్‌ కరెన్సీ అంటే..? 

సంప్రదాయ పేపర్‌ కరెన్సీకి డిజిటల్‌ రూపమే సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ). బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత ఆధారిత వ్యాలెట్ల ద్వారా డిజిటల్‌ కరెన్సీ మార్పిడి లేదా బదిలీ జరుగుతుంది. ఈ లావాదేవీలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నియంత్రిస్తుంది. అయితే, ఇందుకు సంబంధించిన నిబంధనలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.  


బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ అంటే..? 

డిజిటల్‌ కరెన్సీలను స్టోర్‌ చేయడంతో పాటు వాటితో లావాదేవీలను రికార్డు చేసేందుకు ఉపయోగపడే సాంకేతికతే బ్లాక్‌ చెయిన్‌. ఈ తరహా వ్యవస్థలో పద్దును భవిష్యత్‌లో మార్చడం లేదా హ్యాక్‌ చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే, ఈ బ్లాక్‌ చెయిన్‌ వ్యవస్థలో నమోదయ్యే ప్రతి లావాదేవీని కాపీ చేసి ఆ నెట్‌వర్క్‌తో అనుసంధానితమై ఉన్న అన్ని కంప్యూటర్లు లేదా ఇతర ఎలకా్ట్రనిక్‌ యంత్రాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. 


బిట్‌కాయినే ప్రేరణ.. కానీ భిన్నం

సీబీడీసీకి ప్రేరణ బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలే. అయినప్పటికీ, క్రిపోల్లాగా  వికేంద్రీకరణ కరెన్సీ కాదు. క్రిప్టోలకు చట్టబద్ధత లేదు. కానీ, సీబీడీసీ అధికారిక కరెన్సీ. దీంతో జరిపే లావాదేవీలకూ చట్టబద్ధత లభిస్తుంది. సీబీడీసీలను నగదుతో సమానంగా మార్చుకోవచ్చు కూడా. డిజిటల్‌ కరెన్సీ ప్రవేశంతో చెల్లింపులకు మరింత స్థిరమైన, సమర్థవంతమైన, నమ్మకమైన, నియంత్రిత, అధికారిక అవకాశం అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రయోజనాలతో పాటు వ్యాలెట్‌లోని డిజిటల్‌ కరెన్సీలు హ్యాకింగ్‌కు గురికావడం వంటి రిస్క్‌లు కూడా ఉంటాయని వారు హెచ్చరించారు.