తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర బడ్జెట్ పై విమర్శలు కురిపించడాన్ని బిజెపి తప్పుపట్టింది. కెసిఆర్ కూనిరాగాలు తీస్తున్నారని బిజెపి ఓబిసి మోర్చా అద్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. కేంద్ర బడ్జెట్ చారిత్రక.. అభివృద్ధి కారక.. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేదని లక్ష్మణ్ చెప్పారు. తాయిలాలతో ఎన్నికల బడ్జెట్ ఉంటుందని విశ్లేషకులు చెబుతూ వచ్చారని, అందరి అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ పటాపంచలు చేసిందన్నారు.
ఎన్నికల విశ్లేషకుడు పీకే డైరెక్షన్‌లో బడ్జెట్ ప్రసంగం ముగియక ముందే స్క్రిప్ట్ తయారు చేసుకుని సీఎం కేసీఆర్ కూనిరాగాలు తీశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాదిరిగా ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించి బీజేపీ మోసం చేయదన్నారు. పన్నుల భారం పడకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టారని, పన్నులను పెంచకుండా రూ.5 లక్షల కోట్లకు పైగా అదనపు బడ్జెట్ పెట్టడం విశేష మన్నారు.