ఆమె పాకిస్థాన్‌లో ప్రముఖ టిక్‌టాక్ స్టార్. ఆమె అందానికి, అభినయానికి కొన్ని వేల మంది ఫిదా అయ్యారు. ఆమెకు ఫాలోవర్లుగా మారారు. ఆమె తన పెదాలకు సర్జరీ చేయించుకుని తన అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంది.
అందుకోసమని పాకిస్థాన్ నుంచి లండన్ బయలుదేరింది. అనుకున్నట్టుగానే యూకేలో లిప్ ఫిల్లర్ ట్రీట్‌మెంట్ ప్రారంభించింది. సర్జరీ మధ్యలో ఉండగా ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆమె సర్జరీని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయింది. తాను లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నానంటూ పాక్ టిక్‌టాక్ స్టార్ హరీమ్ షా ఇటీవల టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.
ఆ వీడియోలో ఆమె ముందు నోట్ల కట్టలు కూడా ఉన్నాయి. వాటి సహాయంతోనే సర్జరీ చేయించుకుంటానని ఆమె తెలిపింది. అనుకున్నట్టుగానే ఆమె యూకే వెళ్లి సర్జరీకి సిద్ధమైంది. సర్జరీ మధ్యలో ఉండగా ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన బ్యాంక్ ఖాతాలను స్థంభింపజేసిందని తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఆ సర్జరీ చాలా ఖరీదైనది. బ్యాంక్ ఖాతాలు నిలిచిపోవడంతో ఆమె వద్ద సర్జరీకి అవసరమైన డబ్బులు లేవు.
దీంతో సర్జరీని మధ్యలోనే ఆపేసినట్టు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడింది. సర్జరీని మధ్యలోనే ఆపేయడంతో ఆమె పై పెదవి ఉబ్బిపోయి కనిపిస్తోంది. కాగా, నిబంధనల ప్రకారం పాకిస్థాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వాళ్లు పదివేల డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు.
అంతకు మించితే మాత్రం పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. హరీమ్ షా ఎలాంటి అనుమతీ తీసుకోకుండా 10 వేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని లండన్‌కు తీసుకెళ్లడంతో ఆమెపై పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనీలాండరింగ్ చట్టం కింద విచారణ జరుపుతోంది.