ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?: చంద్రబాబు


ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. కొత్త పీఆర్సీ జీవోలను వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల సమస్యలపై అహంకారంతో కాకుండా.. ఆలోచనతో స్పందించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు లేదా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా?.. రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని నిలదీశారు. 

పోలీసుల కాపలాతో ఉపాధ్యాయులను నిర్బంధించడం దారుణమన్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని, ఉద్యోగులను అగౌరవపరిచే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలని చంద్రబాబు సూచించారు.