విడిపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసిపోతాయా ? అనే చర్చ జరుగుతోంది. ఈ అంశంలో మంత్రి కేటీఆర్ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో…మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు కలిసిపోవడం అసాధ్యమని కుండబద్ధలు కొట్టారు. లోక్ సభలో ఏపీ విభజన జరిగి నేటికి ఎనిమిదేళ్లు గడిచిపోయాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2022, ఫిబ్రవరి 18వ తేదీ శుక్రవారం రాష్ట్ర విభజన, ఇతరత్రా అంశాలపై మాట్లాడారు.
ఏపీకి న్యాయం జరిగే సమయం ఇప్పటికి వచ్చిందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన ఈ వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకోవాలని సీఎం జగన్ కు ఆయన సూచించారు ఏపీకి న్యాయం చేసే బాధ్యతను తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటే..ఆయనకు ఇంకా పేరు, ప్రఖ్యాతలు వస్తాయన్నారు. బ్లాక్ డే ఇన్ ది పార్లమెంట్ అని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారని, పార్లమెంట్ కు చీకటి రోజు ఏదైనా ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన రోజే అంటూ షా వెల్లడించారన్నారు.కాశ్మీర్ విభజన జరుగుతున్న సమయంలో.. ఇది పద్ధతి కాదని కాంగ్రెస్ అంటే… గతంలోలాగా తలుపులు మూయలేదు.. తాము చర్చ చేస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చారన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఎలా పాస్ చేస్తారని షా ప్రశ్నించారని తెలిపారు. ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలపై చర్చ జరగాలని తాను కోరడం జరిగిందన్నారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించామని, గతంలో తాను సుప్రీంను ఆశ్రయించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయలేదన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాంటి స్పందించ లేదన్నారు. పార్లమెంట్ లో స్పీకర్ పాసైన బిల్లును పంపితే రాష్ట్రపతి ఆమోదించి తీరాల్సి ఉంటుందని ప్రణబ్ ముఖర్జీ తనకు తెలియచేయడం జరిగిందన్నారు ఉండవల్లి. తాజాగా విభజన సమయంలోపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.