దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2008లో బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ జడ్జి తీర్పు వెల్లడించారు. ఐపీసీతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణ చట్టం, ఆయుధ చట్టం కింద శిక్షలు ఖరారు అయ్యాయి. 2008లో వరుస బాంబు పేలుళ్లలో 56 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో 49 మందిని దోషులుగా పేర్కొంటూ ఇటీవల ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 28 మంది నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. మొత్తం 77 మంది నిందితులను విచారించిన గుజరాత్ స్పెషల్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.2008 జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ నగరంలో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, మున్సిపల్ ఎల్జీ ఆస్పత్రి, కార్లు, పార్కింగ్ ప్రదేశాల్లో పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీటిపై నమోదైన కేసులకు సంబంధించి గుజరాత్ పోలీసులు మొత్తం 85 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు జరుగుతుండగా 78 మందిపై విచారణ కొనసాగించారు.
గుజరాత్‌లో సంచలనం సృష్టించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ తీర్పును వెలువరించారు. అంతకుముందు ఈ కేసు తీర్పును ప్రకటించడానికి చాలాసార్లు నోటీసు ఇచ్చింది. కానీ వాయిదా పడింది. ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం 35 కేసులు నమోదు కాగా, వీటిని ఒక కేసుగా ఏకీకృతం చేసిన తర్వాత విచారణ ప్రారంభమైంది. పేలుళ్లు జరిగిన అహ్మదాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. గుజరాత్ స్పెషల్ కోర్టు 1,100 మందికి పైగా సాక్షులను విచారించింది.