ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజినికి అస్వస్థత.. చికిత్స అందిస్తున్న వైద్యులు...
ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆమె పర్యటించారు. అక్కడ అనేక ప్రారంభోత్సవాలకు ఆమె హాజరయ్యారు. సోమవారం రాత్రి వీటిలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి జగ్గయ్యపేటకు వచ్చారు. అక్కడ తమ సమీప బంధువు స్థానిక ఎస్జిఎస్ కళాశాల ఏవో కే సత్యనారాయణరావు ఇంటికి వచ్చారు.
ఆ తర్వాత మంగళవారం జగ్గయ్యపేటలో సామాజిక వైద్యశాలలో నూతన భవనాలు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పలు విభాగాలను మంత్రి విడదల రజిని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో ఆస్పత్రిలో రద్దీ విపరీతంగా ఉంది. దీని కారణంగా ఆమె పలుమార్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఆ తర్వాత జరిగిన సభలో కూడా ఆమె ముక్తసరిగానే మాట్లాడారు. ఎక్కువసేపు మాట్లాడలేక తొందరగా కూర్చుండిపోయారు. ఆమె పరిస్థితి ఇబ్బందిగా ఉందని గమనించిన.. ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారిని సుహాసిని ఆమెకు ఓఆర్ఎస్ పాకెట్ ఇచ్చారు. అయినా.. ఇబ్బంది పెరగడంతో మంత్రి మధ్యలోనే వేదిక దిగి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు.
వెంటనే.. కాగా ఆమె బంధువుల ఇంటికి చేరుకున్నా వైద్యాధికారులు. ప్రభుత్వ వైద్యాధికారులు, డాక్టర్ సౌజన్య పర్యవేక్షణలో మంత్రికి సెలైన్ ఎక్కిస్తూ… చికిత్స అందిస్తున్నారు. మంత్రి విడదల రజిని అస్వస్థతకు కారణం అలసట, నీరసం అని వైద్యులు చెప్పారని ఆమె సన్నిహితులు తెలిపారు. రజిని అస్వస్థత గురించి తెలిసిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఇతర నేతలు ఆమెను కోలుకోవాలని పరామర్శించారు.
సోమవారం రాత్రి చిలకలూరిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడినుంచే నేరుగా జగ్గయ్యపేటలో ప్రారంభోత్సవాల్లో పాల్గొనడానికి మంత్రి రజిని బంధువుల ఇంటికి వచ్చారు. పని ఒత్తిడి, రెస్ట్ లేకపోవడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.
మంత్రి షెడ్యూల్ ప్రకారం... మంగళవారం మధ్యాహ్నమే.. చిలకటూరిపేట వెళ్లాల్సి ఉంది. కానీ అస్వస్థత కారణంగా ఇప్పటికీ జగ్గయ్యపేటలోని బంధువుల ఇంట్లోనే ఉన్నారు. ఆమెకు వైద్యం జరుగుతోంది.