ఉత్తర ప్రదేశ్ అక్కాచెల్లెల హత్యాచార ఘటనలో దర్యాప్తు శరవేగంగా ముందుకెళ్తోంది. పైగా బాధితులు దళితులు కావడంతో యూపీ పోలీసులపై ఒత్తిడి మరింతగా పెరిగింది. నిందితులు సుహేయిల్, జునైద్, హఫీజుల్ రెహమాన్, కరీముద్దీన్, ఆరిఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు, బాధితుల పక్కింట్లో ఉండే చోటును సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్ స్పందించారు. ఈ ఘటనపై యోగి సర్కార్ తీవ్రంగా స్పందించింది.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. నిందితులకు విధించే శిక్షతో రాబోయే తరాల్లో ఇలాంటి నేరాలు చేయడానికి వెన్నులో వణుకుపుట్టాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. మరోవైపు శవపరీక్షలో మైనర్లపై అఘాయిత్యం జరిగిందని, చెరుకు తోటలో ఇద్దరమ్మాయిలపై సుహేయిల్, జునైద్‌లు రేప్‌కి పాల్పడగా.. మిగతావాళ్లు ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఎస్పీ సంజీవ్ సుమన్ వెల్లడించారు. వాళ్ల దుపట్టాలతోనే ఉరేశారని, ఆపై చెరుకుతోటలోనే ఓ చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఎస్పీ అన్నారు.