ఉపగ్రహాలు తప్పుడు కక్ష్యలోకి వెళ్లాయి..


ఆదివారం ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు తప్పుడు క
క్ష్యలోకి వెళ్ళాయి. ఇస్రో నూతన రాకెట్ మొదటిసారి ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే ఇవి వృత్తాకార కక్ష్యలోకి వెళ్ళవలసి ఉండగా, దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి వెళ్ళాయి. దీంతో ఇవి ఇక పనికిరావు. శ్రీహరి కోట నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఈ రెండు ఉపగ్రహాల ప్రయోగం జరిగింది. 

అనంతరం 738 సెకండ్లకు,  788 సెకండ్లకు ఇవి ఎస్ఎస్ఎల్‌వీ నుంచి వేరుపడటంతో మిషన్ కంట్రోల్‌ రూమ్‌లో నిశ్శబ్దం ఆవరించింది. శాస్త్రవేత్తలు సమస్యను గుర్తించారు. ఓ సెన్సర్ వైఫల్యాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత చేపట్టిన పరిష్కార చర్య పక్కదారిపట్టింది. ఓ కమిటీ దీనిని విశ్లేషించి, తగిన సిఫారసులు చేస్తుంది. ఈ రెండు ఉపగ్రహాలు ఇక ఉపయోగకరం కాదని వెల్లడైంది. ఎస్ఎస్ఎల్‌వీలో ఘన ఇంధనాల దహన ప్రక్రియ దశలు మూడు ఉంటాయి. అదేవిధంగా ద్రవ ఇంధన ఆధారిత వేగ నియంత్రణ ప్రక్రియ ఉంటుంది. వీటిని ఉపయోగించుకుని ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. 

వాణిజ్యపరమైన ప్రయోగాల కోసం ఆదేశాలను స్వీకరించి, ప్రాసెస్ చేసి, తిరిగి అందజేయగలిగే సమయాన్ని (quick turnaround time)ను దృష్టిలో ఉంచుకుని ఎస్ఎస్ఎల్‌వీని రూపొందించారు. ఎస్ఎస్ఎల్‌వీని ఉపయోగించి ఓ వారంలో ప్రయోగించేందుకు అవకాశం ఉంటుంది. దీనిని రెండు రోజుల్లో సమాయత్తం చేసి, ఆ తర్వాత రెండు రోజుల్లో పరీక్షించి, తదనంతరం రెండు రోజుల్లో రిహార్సల్స్ చేసి, మరో రెండు రోజుల్లో ప్రయోగించవచ్చు. ఈ ప్రక్రియ సజావుగా జరిగినట్లు ఇస్రో చైర్‌పర్సన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ శనివారం మీడియాకు చెప్పారు.