మహిళల భద్రత, ఆగ్మగౌరవ పరిరక్షణ విషయంలో వైసీపీ, ప్రభుత్వం వైఖరి ఏమిటనేది తాజా ఉదంతం తేటతెల్లం చేసిందని పలువురు ఆగ్రహిస్తున్నారు. ప్రతిపక్షాలే కాదు..సొంత పార్టీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసినా సీఐడీని రంగంలోకి దించడం జగన్ సర్కారుకు పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆ దూకుడు ఎటుపోయింది? ప్రభుత్వ పనితీరు, విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ మాట్లాడుతున్న సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఐడీకేసు నమోదయింది.
సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు వచ్చిన పోస్టును వేరెకరికి పంపినందుకే గుంటూరు జిల్లాకు చెందిన అరవై ఏళ్లు పైబడ్డ మహిళపై కేసు పెట్టారు. వ్యతిరేక పోస్టు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె తెలుగుదేశం పార్టీ నాయకురాలు శిరీషను సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. అదే సమయంలో ఎంపీ మాధవ్ వ్యవహారంలో మాత్రం మూడు రోజులుగా నిమ్మనడం లేదు. అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థను కలిగిన పోలీసు యంత్రాంగం రోజులు గడుస్తున్నా బయటకు పొక్కిన వీడియో నిజమైందా లేక కల్పితమా అనేది కూడా చెప్పలేకపోతోంది మరి! ఒకవేళ.. మాధవ్ పేరిట చలామణి అవుతున్న వీడియో ఆవాస్తవమని తేలితే.. దానిని ప్రభుత్వం అధికారికంగా బహిర్గతం చేయవచ్చు కదా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎంపీ మాధవ్ డర్టీ వీడియో వ్యవహారంలో మాత్రం అచేతనుడైపోయారా? అక్కలు, చెల్లెమ్మలను వేధిస్తే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టి 21 రోజుల్లో ఉరి తీస్తామన్న జగనన్న.. ఓ మహిళ ఎదుట అసభ్య ప్రదర్శన చేసిన సొంత పార్టీ ఎంపీపై ఉదారత ప్రదర్శిస్తున్నారా? ముఖ్యమంత్రి హోదాలో తీసుకోవాల్సిన కనీస చట్టపరమైన చర్యల విషయంలోనూ చేతులెత్తేశారా?... మూడురోజుల క్రితం వీడియో బయటకు వచ్చి...సభ్య సమాజం ఛీకొడుతున్నా ఇంకా నాన్చుడి ధోరణే కొనసాగిస్తున్న తీరు చూస్తున్నవారు ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం ఇస్తున్నారు. మాధవ్ వీడియో నిజమని తేలితే.. భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన నిర్ణయాలు ఉంటాయన్న ఆయన హెచ్చరికలు ఇప్పుడు ఏమయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు.
