వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలి:

 


వచ్చే ఎన్నికలకు బీజేపీతో జనసేన పొత్తు, కలిసి పని చేసే అంశాలపైనా చర్చిస్తామని చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇరు పార్టీల నేతలు కలిసే రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తారని అన్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి తానే అనే అంశంపై తనకు తెలియకుండానే ప్రచారం జరుగుతోందన్నారు పవన్ కల్యాణ్. ఇంతవరకు తన వద్దకు ఉమ్మడి సీఎం అభ్యర్థి ప్రతిపాదనేదీ రాలేదన్నారు పవన్ కల్యాణ్. ఏదో ఆశ పెడితే పడిపోయే వ్యక్తిని తాను కాదన్నారు.పొత్తులపై నిర్ణయానికి ఇంకా సమయం ఉందన్నారు పవన్. 

జనసేన పొత్తు గురించి వైసీపీ నేతలకు కంగారు ఎందుకు? అని ప్రశ్నించారు పవన్. కోనసీమలో హింసాత్మక ఘటనలపై డీజీపీ, సీఎం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు పవన్. అమరావతికి తాము 300 మంది బయలుదేరితే డీజీ స్థాయి అధికారులు అడ్డుకున్నారని పవన్ గుర్తు చేశారు. మరి అమలాపురంలో ఒకేసారి అంతమంది ఎలా వచ్చారో పోలీసు అధికారులకే తెలియాలని సెటైర్లు వేశారు.కోనసీమ వివాదం రాజకీయ కుట్రగా భావిస్తానన్న పవన్.. ఇతర జిల్లాలకు పేర్లు పెట్టిన సమయంలో వివాదాలు తలెత్తలేదని, కానీ, కోనసీమ జిల్లా పేరు మార్పుని ప్రత్యేకంగా పెట్టి రెచ్చగొట్టడంతోనే ఘర్షణలు జరిగాయన్నారు. అంబేద్కర్ పేరుని అనవసరంగా రాజకీయం చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు పవన్. మూడు రోజుల్లో కోనసీమలో పరిస్థితులు మారిపోతే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. కేంద్ర నిఘా వ్యవస్థ పది రోజుల ముందే హెచ్చరించినట్లుగా సమాచారం ఉందన్నారు. అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.కశ్మీర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ తరహా గొడవలు చూశామన్న పవన్.. కోససీమలో ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవను.. కుల ఘర్షణగా మార్చారని పవన్ ఆరోపించారు. అందుకే దీన్ని సీఎం జగన్, డీజీపీ లైట్ తీసుకున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ ఘటనపై డీజీపీని కలిసేందుకు అనుమతి కోరామని, కానీ స్పందన లేదన్నారు పవన్ కల్యాణ్. డీజీపీ స్పందించకపోతే.. కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.