యువతలో వస్తున్న చైతన్యాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం కుట్ర
కోనసీమ అల్లర్ల ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం తీరు అనుమానాలకు తావిస్తోంది
ప్రభుత్వ పెద్దలు శెట్టిబలిజలపై నోరు పారేసుకోవడం దారుణం
హోంమంత్రి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి...
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను పూర్తిస్థాయిలో ఆచరిస్తూ, వాటిని నేటి యువతరానికి స్ఫూర్తి మార్గాలుగా చూపిస్తూ నిజమైన రాజకీయాలు చేస్తున్న ఏకైక నాయకుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్ అన్నారు. దళిత యువతకు అరచేతిలో వైకుంఠం చూపిన ఈ ప్రభుత్వ మోసంపై దళిత యువత చైతన్యవంతం అవుతున్న వేళ... కోనసీమ అల్లర్లకు కావాలనే ప్రభుత్వం బీజం వేసిందన్నారు. కోనసీమ అల్లర్లను ఖండిస్తూ శ్రీ విజయ్ కుమార్ గుంటూరులో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ శ్రీ పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును జిల్లాలకు పెట్టొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. రాజ్యాంగ నిర్మాత పేరును అనవసరంగా రాజకీయంలోకి లాగొద్దని, అంతటి మాహానుభావుడి పేరును వివాదం చేయవద్దని మాత్రమే ప్రభుత్వానికి సూచించారు. దాన్ని అర్థం చేసుకోకుండా వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం హేయం. నోరితెరిస్తే బూతులు తప్ప మరేమీ రాని శ్రీ కొడాలి నాని సైతం శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడటం సిగ్గు చేటు. గతంలో అమలులో ఉన్న దళితులకు సంబంధించిన సుమారు 28 కీలకమైన ప్రభుత్వ పథకాలను ఈ ప్రభుత్వం నిలిపివేసింది. ఉన్న పథకాలను ఆపేసి,కొత్తపథకాలనుతీసుకురాలేకపోయింది.మూడేళ్లలో దళితులకు ప్రభుత్వం చేసింది సున్నా. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించింది. ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు కేటాయింపు లేదు. ఇవన్నీ దళిత యువత అర్థం చేసుకుంటున్న సమయంలో దాన్ని పూర్తిగా దారి మళ్లించాలనే కుట్రలో భాగమే కోనసీమ అల్లర్లు. ఇది పూర్తిస్థాయిలో ప్రభుత్వ పెద్దల డైరక్షన్ లోనే జరిగింది.
• సుధాకర్ నుంచి సుబ్రమణ్యం దాకా..
ప్రభుత్వాన్ని నిలదీసిన నర్శీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడుగా ముద్ర వేసి మరణానికి కారణమైన ఈ ప్రభుత్వం.. తాజాగా దళిత యువకుడు శ్రీ సుబ్రమణ్యంను ఏకంగా ఓ ప్రజాప్రతినిధి హత్య చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యలకు అప్పగించిన తీరు భయాందోళనలకు గురి చేసింది. దళిత యువత ఈ ప్రభుత్వ తీరు మీద ఆలోచన చేస్తున్నారు. దళితుల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించడానికే ఈ కుతంత్రం. దళితులు దేవుడిలా భావించే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును అందుకే ఈ ప్రభుత్వం వివాదం చేయాలని చూస్తోంది. ఫలితంగా దళితుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని భావిస్తోంది. ఇదంతా ఓ కుట్ర.
* శెట్టి బలిజలు ఏం చేశారు?
ప్రభుత్వ సలహాదారుగా కీలక పదవిలో ఉన్న శ్రీ జూపూడి ప్రభాకరరావు లాంటి నాయకులు శెట్టిబలిజ వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడటం అత్యంత హేయం. ఈ సమయంలో వివాదాలను పూర్తిగా తగ్గించాల్సింది పోయి, కావాలనే కొన్ని వర్గాలను రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. శెట్టిబలిజ సోదరులను అవమానించేలా, ఆత్మాభిమానం దెబ్బతీసేలా జూపూడి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది కచ్చితంగా వివాదాన్ని పెద్దది చేసే కుట్రలో భాగమే అనిపిస్తోంది. జూపూడి మాటలు అభ్యంతరకం. వీటిని కచ్చితంగా జనసేన పార్టీ ఖండిస్తుంది.
* మీరు ఉన్నది సజ్జల స్ర్కిప్ట్ చదవడానికి కాదు..
హోంమంత్రి కనీసం నిజానిజాలు తెలుసుకోకుండా, అమలాపురంలో ఏం జరిగిందో పరిశీలించకుండా ఇష్టానుసారం మాట్లాడటం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎవరిపై కుట్ర పన్నిందో సామాన్యులకు కూడా తెలుస్తుంది. ఘటన జరిగిన వెంటనే శ్రీ సజ్జల స్ర్కిప్ట్ ను చదివి, ఇతరులపై లేనిపోని నిందలు వేసి అదే పాలన అనుకోవడం మానండి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా హోంమంత్రి గారు నిజానిజాలు తెలుసుకొని, పూర్తి నివేదికలు తెప్పించుకొని మాట్లాడండి. ఓ మంత్రి, ఎమ్మేల్యే నివాసాలు మంటల్లో తగలబడుతుంటే యంత్రాంగం స్పందించిన తీరు వివాదాస్పదంగానే ఉంది. సీసీ టీవీ ఫుటేజీలు ఆగిపోయాయి అని అంటున్నారు. అది సందేహాస్పదంగానే ఉంది. ఇదంతా ఎవరు.. ఎందుకు చేపించారు? అన్న దానిపై ప్రజలకు అవగాహన వస్తోంది. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఆపలేరు. మీరెన్ని కుయుక్తులు పన్నినా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన ఆశయాల దారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విడవరు. మేం నిరంతరం ప్రజల్ని చైతన్నవంతుల్ని చేస్తూనే ఉంటాం. ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని భావించే ఈ ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతూనే ఉంటాం’’ అని అన్నారు. సమావేశంలో జనసేన పార్టీ డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ గౌతమ్, రాష్ర్ట కార్యదర్శి శ్రీ బేతపూడి విజయ్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొప్పుల కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీ ఆళ్ల హరి, జిల్లా నాయకులు శ్రీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.