ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్‌లో నోబాల్ వివాదం.


శుక్రవారం రాత్రి జరిగిన ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది.
అయితే చివరి ఓవర్‌లో హైడ్రామా నడిచింది. ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన తరుణంలో రోవ్‌మెన్ పావెల్ చెలరేగి ఆడాడు. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ వేసిన 20వ ఓవర్లో తొలి మూడు బంతులకు పావెల్ 3 సిక్సర్లు కొట్టాడు. అయితే మూడో బంతికి మెకాయ్ వేసిన ఫుల్ టాస్‌ బంతిని అంపైర్ సరైన బాల్‌గానే ప్రకటించడంతో ఢిల్లీ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది నోబాల్ అని వాదించింది. చెస్ట్ వరకు బాల్ ఫుల్‌టాస్ వచ్చిందంటూ పావెల్ వాదించగా అంపైర్ ఒప్పుకోలేదు.దీంతో డగౌట్‌లో కూర్చున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. 

బ్యాటింగ్ చేయకుండా డగౌట్‌కు వచ్చేయాలంటూ క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లకు సైగలతో సందేశాన్ని పంపాడు. దీంతో పావెల్, కుల్‌దీప్ యాదవ్ వెళ్లిపోవడానికి రెండు అడుగులు ముందుకు వేశారు. వెంటనే అంపైర్ నితిన్ మీనన్ వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ పంత్ తమ టీమ్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేను బలవంతంగా మైదానంలోకి పంపాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఇతర వ్యక్తులు ఆట జరిగేటప్పుడు మైదానంలోకి రాకూడదు. దీంతో అంపైర్ నితిన్ మీనన్ ఆమ్రేను బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాడు.

అయితే కాసేపటికి ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రిప్లేలో కూడా కాస్త నోబాల్‌లాగే కనిపించిందని కామేంటేటర్లు అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి మ్యాచ్ మళ్లీ ప్రారంభం కావడంతో మెకాయ్ చివరి మూడు బంతులను కట్టుదిట్టంగా వేయడంతో రాజస్థాన్ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ కెప్టెన్ పంత్ మ్యాచ్ జరిగే సమయంలో వేరే వ్యక్తిని మైదానంలోకి పంపడంతో అతడికి జరిమానా పడే అవకాశాలున్నాయి.