ప్రముఖ ఆలయాల్లో ఒకటైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 2022, మార్చి 04వ తేదీ శుక్రవారం స్వస్తి వాచనంతో అర్చకులు ప్రారంభించారు. గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనంతో ఇతర కార్యక్రమాలను పండితులు నిర్వహించారు.
యజ్ఞాచార్యులకు, ఆలయ అర్చకులకు దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి రక్షాబంధనం చేశారు. దేవస్థాన ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ బి.నర్సింహమూర్తిలకు అర్చకులు రక్షాబంధనం చేశారు.తర్వాత పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారి కళ్యాణానికి అవసరమయ్యే పుట్టమన్ను తెచ్చి కళ్యాణ మండపంలో స్వామి వారిని అధిష్టింప చేశారు.
12 పాత్రలలో వేసి.. 12 రకాలైన ధాన్యాలను వేసి 12 రకాల దేవతలతో అవాహన చేసి ప్రత్యేక పూజలతో అంకుర్పారణ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. బాలాలయాన్ని వివిధ రకాలతో పూలతో అలంకరించారు.
2022, మార్చి 04వ తేదీ శుక్రవారం నుంచి మార్చి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సావాలు జరుగనున్నాయి