జనసేన పార్టీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు గబ్బర్‌సింగ్. 2024 ఎన్నికలే టార్గెట్‌గా తాడేపల్లి సభ వేదికగా.. పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు రెడీ అయ్యారు.
ఆవిర్భావ సభతోనే ఆనాటి ఎన్నికలకు సమరశంఖం పూరించాలని భావిస్తున్నారు జనసేనాని. గతంలా కాకుండా పూర్తిస్థాయిలో యుద్ధభేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వరుసగా మీటింగ్స్ పెడుతూ పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు పవన్. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉండటంతో మరింత దూకుడు పెంచాలని ప్లాన్ చేశారు. దీన్ని సోమవారం జరిగే ఆవిర్భావ సభతోనే ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.అధికార పక్షం వైసీపీపై సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు పవన్ కల్యాణ్. సమస్య దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఉద్దానం సమస్యపై యుద్ధం చేసినంత పని చేశారు.
అమరావతి రైతులకు అండగా ఉంటామంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. మహిళలకు రక్షణ లేదంటూ ఆడవారిలోనూ జనసేన పట్ల ఆదరణ పెరిగేలా వీలు చిక్కిన ప్రతిసారి వారి పక్షాన మాట్లాడారు. మంత్రులనైతే తన మాటలతో ఓ ఆట ఆడుకున్నారు. దీంతో పవన్‌ను టార్గెట్ చేసేందుకే వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల విషయం తెరపైకి తెచ్చారనేది కూడా జనసైనికుల వాదన. ఇలా వైసీపీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసి యుద్ధం ప్రకటించారు జనసేనాని.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. ఈ సభ ఏర్పాటు కాబోతుండడం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతున్న నేపథ్యంలో భీమ్లానాయక్ నుంచి ఎలాంటి ప్రకటనలు, భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు వెలువడతాయనేది అంతా చర్చించుకుంటున్నారు.