అభిమానులకు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని.!


టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్
కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. దీంతో 

ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ధోనీ జట్టులో కొనసాగుతాడని జట్టు యాజమాన్యం ప్రకటించింది. డిఫెండింగ్ ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్‌కే ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో గత సీజన్ రన్నరప్ అయిన కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌తో ఈ నెల 26న ముంబైలో తలపడుతుంది.


స్పాట్ ఫిక్సింగ్‌ కుంభకోణం కారణంగా చెన్నై జట్టు రెండేళ్ల పాటు నిషేధానికి గురికావడంతో 2016, 2017 సీజన్లలో రైజింగ్  పూణె సూపర్ జెయింట్స్‌కు ధోనీ ప్రాతినిధ్యం వహించాడు. తిరిగి 2018లో చెన్నైకి వచ్చేశాడు. ఆ ఏడాది బ్యాట్‌తో అద్బుతంగా రాణించి జట్టుకు టైటిల్ అందించాడు. 150.66 స్ట్రైక్‌రేట్‌తో 455 పరుగులు చేశాడు. 

భారత జట్టు విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా ఖ్యాతికెక్కిన ధోనీ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 చాంపియన్స్ ట్రోఫీలను దేశానికి అందించాడు. ఇక, ఐపీఎల్‌లో చెన్నై సారథిగా ఆ జట్టుకు నాలుగు టైటిళ్లు అందించిపెట్టాడు. 2020 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. తిరిగి 2021లో జట్టుకు మరో టైటిల్ అందించి విమర్శకుల నోళ్లు మూయించాడు.

ఇక, చెన్నై జట్టు కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా 2012 నుంచి ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో మొహాలీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ స్టార్ ఆల్ రౌండర్ 175 పరుగులు చేయడమే కాకుండా 9 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు, ధోనీ తాజా ప్రకటన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ధోనీ 2014లో ఆస్ట్రేలియా సీజన్ మధ్యలోనే ఒక్కసారిగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశాడు. 2017లో పొట్టి ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆగస్టు 2020లో మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో ఒకరు ధోనీ కాగా, మరో ఆటగాడు రవీంద్ర జడేజా కావడం గమనార్హం.ఇప్పుడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టును నడించనున్నాడు.