ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లోని నగరిగేర సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ లో కొందరు పేకాట ఆడుతున్నట్లు కర్ణాటక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడులు చేశారు. మొత్తం 19 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. ఇందులో హిందూపురంకు చెందిన పేకాటరాయుళ్లు దొరికారు. పట్టుబడ్డవారిలో వైసీపీ, టీడీపీలకు చెందిన వారున్నారు. వారిలో బాలకృష్ణ పీఏగా పనిచేస్తున్న బాలాజీతో పాటు హిందూపురం వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి ఉన్నారు.
వైసీపీ నేతలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ పేకాట ఆడటం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో వ్యక్తిగత పనుల కోసం పెట్టుకున్న వ్యక్తి ఇలా ప్రత్యర్థులతో సిట్టింగ్ వేయడంపై హిందూపురంలో ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు.
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఈ వైరం కొనసాగుతోంది. ఇక హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అధికార వైసీపీ పార్టీ తీరుని ఎండగడుతూ పోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పీఏ.. ఏకంగా అధికార వైసీపీ నేతలతో కలిసిపోయి పేకాట ఆడటం తెలుగు తమ్ముళ్లను విస్మయానికి గురి చేసింది.