ఈరోజు రాత్రి గం.8-30కి ఏపీలో గంటపాటు ఎర్త్ అవర్


ఏపీలో ఈరోజు రాత్రి గం.8-30 నుంచి గం.9-30
వరకు ఎర్త్ అవర్ పాటిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆఫీసులు ,ఇళ్ళల్లో అవసరం లేని  చోట్ల విద్యుత్‌ లైట్లను ఆర్పివేయడం ద్వారా ‘ఎర్త్‌ అవర్‌’ ప్రచారంలో పాల్గొనాలని గవర్నర్‌   బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 

భవిష్యత్‌ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన అన్నారు.‘ఎర్త్‌ అవర్‌’ ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకూ విజయవాడ రాజ్‌భవన్‌ ఆవరణలో అన్ని అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.

రాత్రిపూట ఓ గంటపాటు కరెంటు నిలిపేస్తే.. పర్యావరణానికి, భూమికి మేలు జరుగుతుందని పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. కర్బన ఉద్గారాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపం తగ్గించకుంటే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.

ఏటా మార్చి 26న రాత్రి గంటపాటు విద్యుత్‌ సహా ఇతర రకాల ఇంధనాల వినియోగం నిలిపేసి భూమికి కొంతైనా ఉపశమనం కలిగించేందుకు ‘ఎర్త్‌ అవర్‌’ను ప్రజా ఉద్యమంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామని వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌(డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇండియా ఏపీ డైరెక్టర్‌ ఫరీదా తంపాల్‌ తెలిపారు.