అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. బస్సులో పెళ్లి కుమారుడు, అతని బంధువులు ఉన్నారు. అందరూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటున్న సమయం. ఘాట్ రోడ్డులోకి ఎంటరవగానే ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది.
అంతే లోయలో పడిపోయింది. బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురైపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కొంతమంది ప్రాణాలు వీడిచారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 2022, మార్చి 26వ తేదీ శనివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.దీంతో ధర్మవరం నుంచి మధ్యాహ్నం ప్రైవేటు బస్సులో 63 మందితో బయలుదేరారు. దొనకటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపు వద్ద బస్సు అమాంతం అదుపు తప్పింది. సుమారు 50 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోదించారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం.. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. చిమ్మచీకటి కావడంతో ప్రమాద విషయం ఆలస్యంగా తెలిసింది. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఆరుగురు స్పాట్ లోనే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయారు. మృతుల్లో ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. గాయపాలైన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.