యుక్రెయిన్ నుంచి తిరిగివస్తున్న తెలుగు విద్యార్థులు .. ఢిల్లీకి చేరిన మరో విమానం..!


యుక్రెయిన్ నుంచి సోమవారం (ఫిబ్రవరి 28) ఉదయం
ఢిల్లీకి మరో విమానం చేరుకుంది. 249 మందితో రుమేనియా నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి చేరుకుంది.ఉదయం వచ్చిన ఎయిరిండియా విమానంలో 11 మంది తెలంగాణ విద్యార్థులు, ఏపీ విద్యార్థులు ఉన్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు యుక్రెయిన్ నుంచి భారత్‌కు ఏపీ, తెలంగాణ కలిపి మొత్తంగా 58 మంది తెలుగులు విద్యార్థులు క్షేమంగా భారత్ చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తమ స్వస్థలాలకు వెళ్లేంతవరకు తెలుగు విద్యార్థులకు ఉండేందుకు ఢిల్లీలోనే బస కూడా ఏర్పాటు చేశారు. 


బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి చేరిన రెండో విమానంలో
250మంది భారతీయులు ఉన్నారు. వారిలో 11మంది ఏపీ విద్యార్థులు, 17మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. అలాగే ముంబై చేరుకున్న విమానంలో 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.యుక్రెయిన్ నుంచి ముంబైకి విమానంలో 219మంది విద్యార్థులు చేరుకున్నారు. యుక్రెయిన్ యుద్ధ వాతావరణంతో భయాందోళనకు గురైన భారతీయులు మూడు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో భారతీయులంతా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు క్షేమంగా చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. యుక్రేనియన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ప్రత్యేక విమానంలో 20 మంది ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిని ముంబై నుంచి ఇండిగో విమనంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తెలంగాణ ప్రభుత్వం తరపున రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలుగు విద్యార్థులకు స్వాగతం పలికారు.