మానవుల్లో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని, అప్పుడే ధర్మం నాలుగుపాదాలపై నడుస్తుందని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌లో 13 రోజుల పాటు నిర్వహించనున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు బుధవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి దాదాపు 25వేల మంది భక్తులు హాజరయ్యారు. వేలాది మంది రుత్వికులు, వేదపండితులు పీఠాధిపతులు వాస్తుశాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చినజీయర్‌స్వామి.. సహస్ర కుండాత్మక మహాలక్ష్మీనారాయణ యాగం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాస్తు పూజ విశేషాలను వివరించారు. ‘‘తొలిరోజున అశ్వవాహనంపై శోభాయాత్రగా వచ్చిన శ్రీరామచంద్రమూర్తి.. ప్రతిరోజు ఓ అలంకరణతో యాగశాలకు ఊరేగింపుగా విచ్చేస్తారు. 4నుంచి రోజూ ఉదయం 6-30 గంటలకు యాగశాల వద్ద అష్టాక్షరి మహామంత్ర జపం నిర్వహిస్తాం.
అగ్నిమధన కార్యక్రమంతో నేడు యజ్ఞాలు ప్రారంభం కానున్నాయి’’ అని పేర్కొన్నారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో ఉదయం 10 గంటలకు దివ్యసాకేత మందిరంలో నుంచి శ్రీరామ చంద్రమూర్తి ఉత్సవమూర్తుల శోభా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ఐదుగురు జీయర్ స్వాములు (అహోబిల రామానుజ జీయర్‌స్వామి, దేవనాథ రామానుజ జీయర్‌స్వామి, రామచంద్ర రామానుజ జీయర్‌స్వామి, అష్టాక్షరీ రామానుజ జీయర్ స్వామ్రి, వ్రతధార రామానుజ జీయర్‌స్వామి) పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ధి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. రుత్వికులకు కంకణాలు కట్టారు.
లక్ష్మీనారాయణ యాగాన్ని గతంలో తిరుమలలో నిర్వహించారని.. తదనంతరం లోక కల్యాణార్థం ఇక్కడే నిర్వహిస్తున్నారని అహోబిల జీయర్‌స్వామి తెలిపారు. ఈ సందర్భంగా రామానుజాచార్యుల పోస్టల్ కవర్, పోస్టల్ స్టాంపులను తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ వీవీ సత్యనారాయణరెడ్డి సమక్షంలో చినజీయర్‌స్వామి, మైహోం రామేశ్వర్‌రావు ఆవిష్కరించారు.