చలో విజయవాడ’కు సిద్ధమైన ఉద్యోగు, ఉపాధ్యాయులపై బుధవారం ఉదయం నుంచే నిర్భందకాండ మొదలైంది. పోలీసులను ఎక్కడికక్కడ రంగంలోకి దించి జిల్లాల్లో అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. కొవిడ్ రూల్స్ సాకుతో ఉద్యోగులను ఒత్తిడి పెడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలు ఇళ్లకు పోలీసులు చేరుకుని ఈమేరకు నోటీసులు అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడవైపు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు మోహరించారు. నగరంలోకి ప్రవేశించే వారధి, గొల్లపూడి, హనుమాన్ జంక్షన్, గన్నవరం శివార్లలో చెక్‌పోస్టులు పెట్టారు. ఏ దారినీ వదలకుండా జల్లెడ పడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే ఆయా జిల్లాల్లో ట్రావెల్ ఏజెన్సీలపై ఇంటెలిజెన్స్ అధికారులు కన్నేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లాడ్జీలు, డార్మెటరీల్లో సోదాలు చేస్తున్నారు.
సభ జరిగే విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులోనే వంద సీసీ కెమెరాలను బుధవారం సాయంత్రం ఏర్పాటుచేశారు. ఉపాధ్యాయులపై మరింత ప్రత్యేకంగా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇంటిదగ్గరే ఆపేయడం, పాఠశాల నుంచి వస్తుంటే నిర్బంధించడం, అక్కడినుంచి బయల్దేరి విజయవాడ వస్తుంటే...నాలుగువైపులా పోలీసుల్ని పెట్టి తనిఖీలు చేయడం..అడ్డుకోవడం చేసింది. కేసులు, తిరగడాలు అవసరమా? అన్న సుతిమెత్తని హెచ్చరికలను పంపించారు. అయినా సరే బండిమీద, ఆటోలో, బస్సుల్లో, రైళ్లలో బయల్దేరిన వారిని ఎక్కడికక్కడ ఆపి తనిఖీలు చేస్తున్నారు. గ్రామ వలంటీటర్లకు దీనిపై ప్రత్యేకంగా సూచనలిచ్చింది. వలంటీర్లకు కేటాయించిన ఇళ్ల పరిధిలో ఉన్న ఉపాధ్యాయులెవరు; వారి పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకోవడం, వారికి విజయవాడకు వెళ్లొద్దని చెప్పడం చేసింది.
అంతేకాకుండా అలా వెళ్లేవారిపై నిఘా పెట్టామన్న సంకేతాలు ఇచ్చింది. వెళ్తే ఇబ్బందిపెడతారన్న హెచ్చరికలు జారీచేసింది. ఉపాధ్యాయులపై ఈ స్థాయిలో కేంద్రీకరణ పెంచడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో పిలుపిచ్చినప్పుడు ఊహించనంత సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారీ ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను చూసి ప్రభుత్వమే అవాక్కైంది. మళ్లీ అలాంటి సంఘటిత ప్రదర్శన జరగకూడదనే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ కట్టడికి సర్కారు సిద్ధమైంది.