ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్‌కు సంబంధించిన చర్చే జరుగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల మంచి టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కెరీర్‌లో మరో సూపర్ హిట్ పడిందని పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భీమ్లా నాయక్ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చి చేరారు. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్‌ను, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్టులు చేసే వర్మ.. భీమ్లా నాయక్ విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్ వేదికగా భీమ్లా నాయక్‌పై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేస్తూ.. ‘నేను ముందు నుంచి చెబుతున్నట్లు భీమ్లా నాయక్ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలి. ఈ సినిమా హిందీలో కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో.. ‘భీమ్లా నాయక్ ఒక మెరుపు, పవన్ కళ్యాణ్ సునామి. రానా కూడా పవన్‌తో పాటీ పడీ నటించారు. మొత్తం మీదం భీమ్లానాయక్ భూకంపాన్ని సృష్టించింది’ అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చారు వర్మ. ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ ఇలా సినిమాపై పొగడ్తలు కురిపించడంతో ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి.