పెళ్లింట చావు మేళం.9 మంది మృతి


పెళ్లి జరిగిన.. కాసేపటికే ఆ ఇంట్లో చావు మేళం వినిపించింది. కుమార్తె వివాహం ఘనంగా చేశానన్న సంతోషంతో స్వగ్రామానికి వస్తుండగా.. తండ్రికి చావు ఎదురైంది. తనతో పాటు వివాహానికి తీసుకెళ్లిన మరో ఎనిమిదితో మృత్యు ఒడిలోకి వెళ్లాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా 9 మంది మరణించారు.

కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోకా వెంకటప్ప కుమారై వివాహం ఇవాళ కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఘనంగా జరిగింది. ఈ వేడుక అనంతరం వెంకటప్ప బంధువులతో కలసి ఇన్నోవా వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. వీరు సరిగ్గా  ఉరవకొండ మండలం బూదగవి వద్దకు రాగానే కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంతో ఇన్నోవా నుజ్జునుజ్జయింది. వాహనంలో ఉన్న 9 మంది మృతి చెందారు.

మృతుల్లో 5మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం సంఘటన తెలుసుకున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలం వద్ద అవసరమైన సహాయ సాకారాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సంఘటనా స్థాలానికి వెళ్లారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.