100 మందికిపైగా సైనికులను హతమార్చాం


గురువారం వంద మందికిపైగా పాక్‌ సైనికులను హతమార్చినట్లు ప్రకటన రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. పాకిస్థాన్‌లోని పంజాబ్‌గూర్‌, నుష్కీ సైనిక శిబిరాల్లోని ప్రధాన భాగాలు ఇప్పటికీ తమ ఆధీనంలో ఉన్నాయని బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ అనే ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పాక్‌ ఆర్మీ శిబిరాలు సైతం పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించింది. ఆ తీవ్రవాద సంస్థ విడుదల చేసిన పత్రిక ప్రకటన ప్రకారం.. పాక్‌ సైనిక శిబిరాలపై ఆత్మహుతి దాడులకు తెగబడటంతో సైనికులు బలయ్యారు. ఈ శిబిరాలు ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్నట్లు వెల్లడించింది. అయితే పాక్‌ ఆర్మీ వాదన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దాడి జరిగిన మాట వాస్తవమేనని, తాము కూడా సమర్ధవంతంగా తిప్పికొట్టామని తెలిపింది. ఈ దాడిలో బీఎల్‌ఏకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపింది. అలాగే తమ సైనికుల్లో ఒకరు మరణించినట్లు తెలిపింది. కాగా, వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడిని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. ఉగ్రవాదులను తమ సైన్యం సమర్ధవంతంగా తిప్పటికొట్టిందని చెప్పుకొచ్చారు.

అయితే పాకిస్థాన్‌ తన మీడియాను సంఘటనలను నివేదించకుండా నిషేధించిందని, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు డిస్‌కనెక్ట్ చేయబడిందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. దాడులను తిప్పికొట్టామని పాకిస్థాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ చేసిన వాదన తప్పు అని ఉగ్రవాద సంస్థ పేర్కొంది.