T20 విశ్వ విజేత భారత్

 ఉత్కంఠ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలుపు - సూర్యకుమార్‌ సూపర్‌క్యాచ్‌


బార్బొడాస్‌: టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ను టీమిండియా రెండోసారి కైవసం చేసుకుంది.


చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారతజట్టు ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. విజయానికి దక్షిణాఫ్రికా జట్టు చివరి 30బంతుల్లో 30పరుగులు చేయాల్సిన దశలో ఒత్తిడికిలోనై చేజేతులా ఓటమిపాలైంది. దీంతో తొలిసారి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా జట్టు ఒత్తిడిని జయించడంలో విఫలమై రన్నరప్‌కే పరిమితమైంది. తొలుత టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఫైనల్లో కదం తొక్కాడు. 34పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. భారీషాట్లకు వెళ్లకుండా ఆచి తూచి ఆడారు. మరో ఎండ్‌లో అక్షర్‌ పటేల్‌(47; 31బంతుల్లో ఫోర్‌, 4సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపిస్తున్నా.. నిలకడగా ఆడాడు. అర్ధసెంచరీ పూర్తయ్యాక భారీషాట్స్‌ ఆడాడు. మొత్తమ్మీద 59బంతులను ఎదుర్కొన్న కోహ్లి 6ఫోర్లు, 2భారీ సిక్సర్ల సాయంతో 75పరుగులతో రాణించాడు. శివమ్‌ దూబే(27; 16బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌)కూడా రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 9 పరుగులకే అవుట్‌ కాగా, అదే ఓవర్లో కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌ ఆడి రిషబ్‌ పంత్‌(0) కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌(3) సైతం పెవిలియన్‌ చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే అక్షర్‌ పటేల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ ను నడిపించిన తీరు అద్భుతం. ఓ వైపు తాను

దూకుడుగా ఆడుతూ, ఇతర బ్యాటర్లు కూడా ధాటిగా ఆడే వాతావరణం సఅష్టించాడు. కోహ్లీ అండతో అక్షర్‌ పటేల్‌ చెలరేగాడు. అక్షర్‌ ఔటయ్యాక శివమ్‌ దూబే కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా స్కోరు గౌరవప్రద స్కోర్‌ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌, ఆన్రిచ్‌ నోర్ట్జేకు రెండేసి, మార్కో యన్సెన్‌, కగిసో రబడాకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హెండ్రిక్స్‌(4) నిరాశపరిచాడు. ఆ తర్వాత కెప్టెన్‌ మార్‌క్రమ్‌(4) కూడా త్వరగా పెవీలియన్‌కు చేరడంతో 12పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో డికాక్‌(39), స్టబ్స్‌(31)కి తోడు క్లాసెన్‌(52) అర్ధసెంచరీతో రాణించి దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు 24పరుగులు రాబట్టారు. దీంతో సమీకరణలు మారిపోయాయి. దీంతో చివరి 30బంతుల్లో దక్షిణాప్రికా జట్టు 30పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ దశలో 16వ ఓవర్‌ వేసిన బుమ్రా, హార్దిక్‌, ఆర్ష్‌దీప్‌ 4ఓవర్లు బౌలింగ్‌ చేసి 14పరుగులివ్వడంతో విజయానికి టీమిండియా చేరువైంది. చివరి ఓవర్లో విజయానికి 17పరుగులు కావాల్సి దశలో హార్దిక్‌ పాండ్యా వేసిన ఓవర్‌ తొలి బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ బౌండరీ లైన్‌ వద్ద సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో మ్యాచ్‌ టీమిండియా పక్షాన నిలిచింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి దక్షిణాఫ్రికా 8వికెట్ల నష్టానికి 169పరుగులే చేసి ఓటమిపాలైంది. టీమిండియా బౌలర్లుటీమిండియా బౌలర్లు హార్దిక్‌ పాండ్యాకు మూడు, ఆర్ష్‌దీప్‌, బుమ్రాకు రెండేసి, అక్షర్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…

ఇండియా ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి)క్లాసెన్‌ (బి)మహరాజ్‌ 9, విరాట్‌ కోహ్లి (సి)రబడా (బి)జాన్సెన్‌ 76, పంత్‌ (సి)డికాక్‌ (బి)మహరాజ్‌ 0, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి)క్లాసెన్‌ (బి)రబడా 3, అక్షర్‌ పటేల్‌ (రనౌట్‌)డికాక్‌ 47, దూబే (సి)డేవిడ్‌ మిల్లర్‌ (బి)నోర్ట్జే 27, హార్దిక్‌ (నాటౌట్‌) 5, జడేజా (సి)మహరాజ్‌ (బి)నోర్ట్జే 2, అదనం 7. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 176పరుగులు.

వికెట్ల పతనం: 1/23, 2/23, 3/34, 4/106, 5/163, 6/174, 7/176

బౌలింగ్‌: జాన్సెన్‌ 4-0-49-1, మహరాజ్‌ 3-0-23-2, రబడా 4-0-36-1, నోర్ట్జే 4-0-26-2, షాంసీ 3-0-26-0

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: హెండ్రిక్స్‌ (బి) బుమ్రా 4, డికాక్‌ (సి)కుల్దీప్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 39, మార్‌క్రమ్‌ (సి)పంత్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 4, స్టబ్స్‌ (బి)అక్షర్‌ 31, క్లాసెన్‌ (సి)పంత్‌ (బి)పాండ్యా 52, డేవిడ్‌ మిల్లర్‌ (సి)సూర్యకుమార్‌ (బి)పాండ్యా 21, జాన్సెన్‌ (బి)బుమ్రా 2, మహరాజ్‌ (నాటౌట్‌) 2, రబడా (సి)సూర్యకుమార్‌ (బి)హార్దిక్‌ 4, నోర్ట్జే (నాటౌట్‌) 1, అదనం 9. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 169పరుగులు.

వికెట్ల పతనం: 1/7, 2/12, 3/70, 4/106, 5/151, 6/156, 7/161, 8/168

బౌలింగ్‌ఆర్ష్‌దీప్‌ 4-0-20-2, బుమ్రా 4-0-18-2, అక్షర్‌ 4-0-49-1, కుల్దీప్‌ 4-0-45-0, హార్దిక్‌ 3-0-20-3, జడేజా 1-0-12-0