ఎలాంటి మత్తుమందు ఇవ్వకుండా.. ఓ మహిళకు సినిమా చూసే అవకాశం కల్పించి, ఆమెతో మాట్లాడుతూనే.. రెండు గంటల పాటు సర్జరీ నిర్వహించారు. ఇదేదో అగ్రరాజ్యాల్లోనో.. ఐరోపా దేశాల్లోనో.. లేదా మన వద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో ‘అవేక్ క్రేనియటోమి’ పేరుతో జరిగింది కాదు..! గాంధీ ఆస్పత్రి వైద్యులు ఈ ఘనతను సాధించారు. గురువారం గాంధీ ఆస్పత్రి న్యూరో సర్జన్లు 50 ఏళ్ల ఓ మహిళ మెదడులోని కణుతులను తొలగించారు. హైదరాబాద్‌కు చెందిన ఆ మహిళ ఇటీవల గాంధీ వైద్యులను సంప్రందించగా.. వారు పరీక్షలు నిర్వహించి, ఆమె మెదడులో కణుతులున్నట్లు గుర్తించారు.
గురువారం ఆమెకు శస్త్రచికిత్స చేశారు. రోగికి ఎలాంటి మత్తు ఇవ్వకుండా మెలకువగా ఉండగానే సర్జరీ నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వివరించారు. ఆ సమయంలో ఆమెతో వైద్యులు మాట్లాడుతూ.. అభిమాన నటుల వివరాలు తెలుసుకుని, స్మార్ట్‌ఫోన్‌లో సినిమా చూపించారు. రెండు గంటలపాటు ఆమె సినిమాలో లీనమై.. మధ్యమధ్యలో వైద్యులు/సిబ్బంది అడిగిన ప్రశ్నలకు బదులివ్వగా.. డాక్టర్లు తమ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ఆమె తలలో ఉన్న కణుతులను తొలగించారు. ఈ సర్జరీలో న్యూరో సర్జరీ వైద్యులు ప్రకాశ్‌రావు, ప్రతాప్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.