‘సీఎం శౌర్య పథకం’ సిగ్గుపడుతోంది! జగనన్నా?


తాజాగా జగన్ సర్కారు విడుదల చేసిన ఒక జీవోను చూసినంతనే.. ఆయన చెప్పే మాటలకు.. అమలు చేసే పథకాలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో ఉన్న ఒక నిర్ణయాన్ని తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఉగాది సందర్భంగా రాష్ట్ర పోలీసులకు.. అగ్ని మాపక సిబ్బందికి సీఎం శౌర్య పథకం కింద నగదు.. ప్రశంసా పత్రాన్ని బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటుంది.
దీనికి సంబంధించి తాజాగా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆయా శాఖల వారికి షాకింగ్ గా మారింది. సాధారణంగా ఇలాంటి సీఎం శౌర్య పథకం కింద ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచటం ఉంటుందే తప్పించి.. తగ్గించటం ఉండదు. అందునా.. జగన్మోహన్ రెడ్డి లాంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో.. మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో భారీ మొత్తాన్ని ఫిక్సు చేసి ఉంటారని భావిస్తారు. కానీ.. అందుకు భిన్నంగా గతంలో ఇచ్చే దానితో పోలిస్తే దారుణంగా కోత వేసిన వైనం షాకింగ్ గా మారింది. జగన్ అమలు చేస్తున్న పొలిటికల్ ఎజెండాను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారన్న ఆరోపణల్ని పెద్ద ఎత్తున మూట కట్టుకున్న పోలీసులకు సీఎం జగన్ ఇలాంటి నజరానా ఇవ్వటం ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.150 మొత్తం పురస్కారంగా ఇవ్వటమా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.
సదరు పురస్కారం ముందు సీఎం పేరు ఉన్నందుకైనా భారీగా నగదు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాల్సింది పోయి అందుకు భిన్నంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కొందరు పోలీసులైతే.. ఇదేంది జగనన్నా? అంటూ ప్రశ్నిస్తున్న వైనం కనిపిస్తోంది.