సింహాచలంలో స్వామి వారి నిజరూప దర్శనాలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ తదియలో మంగళవారం వేకువజాము నుంచి అప్పన్న నిజరూపంలో దర్సనమిచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోకగజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న అశోకగజపతి రాజుకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి నిజరూపం దర్శనం కోసం వందల సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్ నాథ్ ,దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ, స్పీకర్ తమ్మినేని సీతరామ్..మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లు స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు.తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా సింహాచల నరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సంక్షేమం, అభివృద్ధి ఫలాలను మరింత సమర్థంగా ప్రజలకు చేరే విధంగా సహకరీంచమని దేవుణ్ణి కోరుకున్నానని అన్నారు. నా కోరికలు అన్నీ జగన్మోహన్ రెడ్డి తీర్చేశారని మంత్రి అమర్నాథ్ అన్నారు.సమాచార శాఖ మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్ పేదరిక నిర్ములన యజ్ఞం చేస్తున్నారని, దానిని అడ్డుకునేందుకు దుష్ట శక్తులు పని చేస్తున్నాయని అన్నారు. ప్రహ్లాదుడిని రక్షించిన విధంగానే మా ప్రభుత్వాన్ని కాపాడమని వరాహాలక్ష్మి నర్సింహా స్వామిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ ప్రజలు అందరూ బాగుండాలని, కరోనా అంతమవ్వాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. స్వామి వారి నిజరూప దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.