విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార ఘటన, తిరుపతిలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ప్రైవేట్ అంబులెన్సుల సిండికేట్ దందాకు కారకులెవరు..? అధికారుల నిర్లక్ష్యం కాదా..? ఇన్ని రోజులుగా దోపిడీ జరుగుతున్నా అధికారుల దృష్టికి ఒక్కసారి కూడా రాలేదా..? వస్తే అధికారులు ఉదాసీనంగా ఎందుకు వ్యవహరించారు..? ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన అంబులెన్స్‌ల అరాచకానికి అడ్డుకట్ట పడుతుందా..?
ఎంత అంబులెన్స్ అయితే మాత్రం కిలోమీటరుకు 180 రూపాయలా వసూలు చేస్తారా..? అంబులెన్స్‌ల సిండికేట్‌కు చెక్ పెట్టేదెవరు..? ఈ అంబులెన్స్‌ల అరాచకానికి అంతంపడేదెప్పుడు...రుయాలో అంబులెన్సుల మాఫియా నిజమేనని అధికారులు తేల్చారు. ఘటన జరిగిన అనంతరం ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, డీఎస్పీతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విచారణ జరిపిన ఈ బృందం.. రుయా ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్సుల దందా వాస్తవమేనని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
రాక్షసత్వమని ప్రజలు పెదవి విరుస్తున్నారు. శవాలపై పేలాలు ఏరుకుంటారా..? ప్రాణానికి ఖరీదు కడతారా..? అంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందా..? రుయా లాంటి ఘటనలు జరగకుండా ముందే ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీస్తున్నారు..