2019 ఎన్నికల ముందు జగన్ కర్నూలుకు వచ్చినప్పుడు అమ్మానాన్నలతో కలసి సుభద్రబాయి ఆయనను కలిసింది. తనను ఆదుకోవాలని విన్నవించింది. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది.. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో తనకు ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని ఆమె ఆనందించింది. అదే ఏడాది ఆగస్టులో కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో కలిసి సీఎం జగన్‌కు పాత హామీని గుర్తుచేసింది. కర్నూలు జిల్లా కలెక్టరుతో మాట్లాడి ఈమెకు ఉద్యోగం ఇప్పించమని అక్కడే ఉన్న కడప జిల్లా కలెక్టరు హరికిరణ్‌కు జగన్ సూచించారు.ఆ తరువాత కర్నూలు కలెక్టరు వీరపాండియన్.. ఆమెను పిలిపించారు. ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చినా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు.
రూ.6 వేల జీతంతో కస్తూరిబా పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన డే వాచ్‌మెన్ పోస్టు ఇచ్చారు. గత డిసెంబరు 22న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి పెళ్లికి వచ్చిన సీఎం జగన్‌ను ఆమె మళ్లీ కలిసింది. తనకు కాంట్రాక్ట్ పద్ధతిన డే వాచ్‌మెన్ ఉద్యోగం వద్దు.. టీటీసీ చేసిన తనకు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వమని విన్నవించారు. మరోసారి సీఎం జగన్ హామీ ఇవ్వడమే కాకుండా.. ఆమె కోరిన ఉద్యోగం ఇవ్వాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు ఆదేశించారు. అయినా.. కొలువు రాలేదు. రెండు చేతులు లేని ఈ యువతికి కాపలాగా ఇద్దరు పోలీసులను పెట్టారు. ఇల్లు దాటకుండా కట్టడి చేశారు. దివ్యాంగురాలు అని కూడా చూడకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంతకీ అంత నేరం ఆమె ఏం చేసింది? ‘మాట తప్పని’ జగనన్న ఇచ్చిన ఉద్యోగ హామీని శనివారం కర్నూలులో కలిసి ఆయనకు గుర్తుచేయాలని అనుకుంది. అదే నేరం.. ఘోరం అని భావించి ఈ దివ్యాంగురాలిని హౌస్ అరెస్టు చేశారు.
శనివారం పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వయాన బావ, వైసీపీ రాష్ట్ర నాయకుడు కంగాటి ప్రదీ్‌పకుమార్‌రెడ్డి కుమారుడి పెళ్లికి సీఎం జగన్ వస్తున్నారు. దీంతో సీఎంను కలిసి మరోసారి విజ్ఞప్తి చేయాలని ఆమె భావించింది. అయితే.. ఆయన వరకు వెళ్లకుండా ముందస్తుగా శుక్రవారం ఆమెను హౌస్ అరెస్టు చేశారు.