చిడతలు వాయిస్తూ, విజిల్స్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీలు


టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, పరుచూరి
అశోక్ బాబు, దీపక్ రెడ్డి, కేఈ ప్రభాకర్, రాజ నర్సింహులు, రామారావు, రవీంద్రనాథ్ రెడ్డి, అంగర రామ్మోహన్ లను చైర్మన్ ఒక్కరోజు సస్పెండ్ చేశారు. శాసనమండలిలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించి, విజిల్స్ వేయడంపై చైర్మన్ మోషెన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సభలో ఇలాంటివి చేయడం మంచిది కాదని హితవుపలికారు. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. 

సభలో చిడతలు వాయించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా అని మండిపడ్డారు. భజన చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వెల్ లోకి వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు..మీ సీట్లలో మీరు కూర్చొని మాట్లాడాలని సూచించారు. కావాలనే గొడవ చేస్తున్నారు.. సభా సమయాన్ని వృధా చేయొద్దని మొదటి రోజు నుంచి చెబుతున్నానని తెలిపారు.టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయగానే స్పీకర్ పోడియంపైకి ఎక్కడానికి దీపక్ రెడ్డి దూసుకెళ్లారు. 

దీపక్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటని టీడీపీ సభ్యులను చైర్మన్ మోషెన్ రాజు ప్రశ్నించారు. మోషెన్ రాజుపై టిడిపి సభ్యులు ప్లకార్డులు విసిరారు. దువ్వాడ శ్రీనివాసరావు తీరుపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు విసిరిన దువ్వాడ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుల ఆందోళన చేపట్టారు. తమకో న్యాయం అధికార పక్షానికి మరొక న్యాయమా.. అంటూ చైర్మన్ ను టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.టీడీపీ సభ్యులు చిడతలతో భజన చేస్తుండగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు డబ్బులు విసిరారు.