దేశ రాజధానికి ఉగ్రముప్పు,,న్యూఢిల్లీలో హైసెక్యూరిటీ


దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం
ఉందంటూ ఉత్తరప్రదేశ్ పోలీస్ నిఘావర్గాలు హెచ్చరించాయి. దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారం అందడంతో న్యూఢిల్లీలో హైసెక్యూరిటీ అలర్ట్ జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు తెలిపిన ప్రకారం టెహ్రిక్-ఎ-తాలిబాన్(ఇండియా సెల్) అనే ఉగ్రవాద సంస్థ నుంచి వెలువడిన ఒక రహస్య ఇమెయిల్ సందేశాన్ని నిఘావర్గాలు విశ్లేషించాయి. దీనిపై ఆరా తీసిన యూపీ పోలీసులు ఢిల్లీలో ఉగ్రదాడులు ఆస్కారం ఉందని అంచనా వేసి ఆమేరకు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. 

యూపీ పోలీసులు అందించిన ఆధారాల మేరకు ఢిల్లీ పోలీసులు మంగళవారం న్యూఢిల్లీలోని సరోజిని నగర్ మార్కెట్‌లో సోదాలు నిర్వహించారు.మరోవైపు భద్రతాపరమైన ముప్పు కారణంగా మార్కెట్లను మూసివేస్తున్నట్లు సరోజినీ నగర్ మినీ మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే, మార్కెట్‌ను మూసివేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. భద్రత పరమైన అంశాలను పాటించాలని మాత్రమే సూచించామని పోలీసులు తెలిపారు. 

ఉగ్రదాడులకు సంబంధించి రహస్య ఇమెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకునేందుకు నిఘావర్ఘాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా మార్చి 25న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈకార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, కీలక నేతలు హాజరు కానున్నారు. ఈక్రమంలో ఢిల్లీలో ఉగ్రదాడులపై నిఘావర్గాల హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.