ఫ్యాన్‌కు ఓటేసి గెలిపిస్తే, ఇళ్లలో ఫ్యాన్ తిరగని పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడికి నష్టం జరిగేలా, కొందరికి మేలు జరిగేలా విద్యుత్ చార్జీలు పెంచడం, శ్లాబ్‌లు మార్చడం దారుణం’ అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెనక్కి తీసుకునే వరకూ ప్రజలతో కలసి జనసేన పోరాటం చేస్తుందన్నారు. సంక్షేమం పేరుతో నవరత్నాలంటూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, రాష్ర్టానికి నష్టం చేసిందని విమర్శించారు.
మూడేళ్ల నుంచి ఆర్థికంగా రాష్ట్రం చిదిగిపోయింది. ప్రభుత్వం సంక్షేమమనే గోబెల్స్ ప్రచారంతో ప్రజలను అంధకారంలోకి నెట్టేసింది. చిన్న వ్యాపారులు మనుగడ సాగించలేని విధంగా చేసింది. జనసేన ఉద్యమిస్తోంది. ప్రభుత్వ పొరపాట్లు ఎండగడతాం. ప్రతీ గ్రామంలోనూ ఆరు నుంచి ఎనిమిది గంటలు విద్యుత్ కోత దారుణమన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తదితరులున్నారు.