ప్రేమించడం లేదని యువతి గొంతు కోశాడు


వెంకటగిరిలో ఓ ప్రేమన్మాది యువతిపై ఘాతుకానికి
పాల్పడ్డాడు. కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఉన్మాదానికి తెగపడ్డాడు చెంచుకృష్ణ అనే వ్యక్తి. బాధిత యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ప్రేమోన్మాది కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు చెంచు కృష్ణ. తనను ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధిత యువతి విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. వేధింపులకు గురిచేస్తున్న చెంచు కృష్ణను యువతి కుటుంబ సభ్యులు మందలించారు. 

అయినా బుద్ది మారని కృష్ణ యువతిని వేధిస్తూనే ఉన్నాడు. 2022, మార్చి 21వ తేదీ సోమవారం ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి వెళ్లిన కృష్ణ.. యువతిపై కత్తితో దాడి చేశాడు. కేకలు వేస్తూ యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కేకలు విన్న స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. దాడి అనంతరం ఇంటికి పారిపోయిన ప్రేమోన్మాది కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.