అప్పుల కోసం చేసినవీక్లీ టూర్‌’ ఈసారి విఫలమైంది.


ఈ వారం కొత్త అప్పుల కోసం చేసిన ప్రయత్నాలు
ఫలించలేదు. గత మూడు వారాల్లో ‘వీక్లీ టూర్‌’ ద్వారా రూ.4వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఈసారి కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు కొత్త అప్పులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మంగళవారం ఆర్‌బీఐ వద్ద జరిగిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం పాల్గొనలేకపోయింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ గత వారాంతంలో ఢిల్లీ వెళ్లారు. కానీ, ఈ సారి కొత్త అప్పునకు కేంద్రం అనుమతివ్వలేదని తెలుస్తోంది. 

అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రకరకాల తప్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగం, చట్టాల్లో ఉన్న అన్ని పరిమితులు ఉల్లంఘించి అప్పులు తీసుకొస్తున్నారు.తప్పుడు అప్పులపై కేంద్రం స్వల్పంగా కన్నెర్ర చేయడం, ఆర్‌బీఐ రెడ్‌ ఫ్లాగ్‌ చూపడంతో బ్యాంకులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. జనవరి-మార్చి త్రైమాసికం కోసం కేంద్రం నుంచి కొత్త అప్పుల కోసం అనుమతి వస్తుందని భావించారు. నేరుగా సీఎం జగన్‌ వెళ్లి పీఎం మోదీని, ఆర్థిక మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసుకున్నారు. 

కేంద్రం గత ఏడాది ఏప్రిల్‌లో ఏపీకి రూ.20,750 కోట్ల అప్పునకు అనుమతిచ్చింది. ఈ అప్పులను ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు రాష్ట్రం వాడుకోవాలి. కానీ, జగన్‌ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మినహా మొత్తం జూలై లోపు వాడేసింది. మిగిలి న ఆ రూ.1000 కోట్లను ఆగస్టులో తెచ్చుకుంది. ఆ తర్వాత బండి నడిచేందుకు కొత్త అప్పుల కోసం ఆర్థిక మంత్రి, ఆ శాఖ సెక్రటరీలు, సీఎస్‌, వైసీపీ ఎంపీలు కేంద్రం చుట్టూ తిరిగారు. దీంతో సెప్టెంబరు 3న రూ.10,500 కోట్ల కొత్త అప్పునకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ అప్పును సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనే వాడేశారు. 

ఆ తర్వాత క్యాపిటల్‌ వ్యయం చేసినందుకు నవంబరులో రూ.2,600 కోట్లు, విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు డిసెంబరులో రూ.2,250 కోట్లు అదనపు అప్పునకు కేంద్రం అనుమతిచ్చింది. సీఎం జగన్‌ జనవరి 3న పీఎం మోదీకి విన్నవించుకున్నందుకు రూ.2,500 కోట్లు, ఫిబ్రవరిలో మంత్రి, అధికారులు ఢిల్లీ వెళ్లి రూ.4,000 కోట్లకు అనుమతి తెచ్చారు. సర్కారు వీటిని వాడేసుకుంది. ఇది చాలదని, మళ్లీ కొత్త అప్పు కావాలని శుక్రవారం ఢిల్లీకి వెళ్లినా.. ఫలితం లభించలేదు.