ముఖ్యమంత్రి రావడానికి అరగంట ముందే, ఉదయం 11 గంటల సమయంలో మంత్రి అప్పలరాజు పలాస మునిసిపల్ చైర్మన్, మరికొందరు అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. వారంతా పీఠంలోనికి వెళ్లబోగా ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఆరిలోవ ఇన్‌చార్జి సీఐ సీహెచ్ రాజులనాయుడు.
నిబంధనల ప్రకారం మంత్రిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని చెప్పారు. మిగిలిన వారిని అనుమతించలేమని స్పష్టం చేశారు. తన వెంట ఉన్న వారిని కూడా లోపలకు పంపించాలని మంత్రి కోరగా..సీఐ ససేమిరా అన్నారు. అయితే..ఈ సందర్భంగా సీఐ తనను ఉద్దేశించి అనుచిత పదం వాడారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పటికే లోపలికి వెళ్లిపోయిన సీఐని బయటికి రప్పించాలని డిమాండ్ చేశారు. మంత్రితోపాటు ఉన్న అనుచరులు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమీపంలోనే ఉన్న ద్వారకానగర్ ఏసీపీ మూర్తి వచ్చి..తెలియక జరిగిపోయిందని, లోపలికి రావాలని కోరినప్పటికీ మంత్రి ససేమిరా అన్నారు. ‘‘నచ్చితే రా.. లేకుంటే దొబ్బేయ్ అంటాడా? వాడిని రమ్మనండి. వాడికి తెలియక కాదు..పోయేకాలం! ఏయ్ బాబూ ఏయ్! తమాషా చేస్తున్నావా? చొక్కా పట్టుకుని లాగేస్తా నా కొడకా! ఎలాక్కనిపిస్తున్నా నీకు? ఎలాక్కనిపిస్తున్నా?’’ అని అక్కడున్న పోలీసులను చేత్తో తోశారు. ‘తమాషాలు ..వేటి’ అంటూ బూతు పదం ప్రయోగించారు.
ఇక మంత్రి అనుచరులు.. ‘‘ఎంత ధైర్యం వాడికి..మంత్రినే దొబ్బేయ్ మంటాడా? వాడిని తీసుకురండి. మంత్రికి క్షమాపణ చెప్పించండి’ అంటూ అక్కడున్న పెందుర్తి, గాజువాక సీఐలను డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అక్కడకు వచ్చి మంత్రికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా..‘అన్నా..నీకు తెలియదు. ఆ సీఐ ఎంతగా అవమానించాడో. ఆ భాష ఏమిటి’’ అంటూ పీఠం లోపలకు వెళ్లేందుకు నిరాకరించారు. ‘‘నేను లోపలకు రావాలంటే.. అతను బయటకు రావాలి! మీరు ఏం చేయనక్కర్లేదు. సీపీని రమ్మనండి’’ అంటూ భీష్మించుకు కూర్చున్నారు. అక్కడే ఉన్న మరొక సీఐ కల్పించుకుని ‘ఆ సీఐ బయటికి రారు’ అని చెప్పడంతో.. ‘మా సీఎం గారిని కలిసేందుకు వచ్చాం. మీరు ఇచ్చిన గౌరవానికి ధన్యవాదాలు’ అంటూ అప్పలరాజు తన అనుచరులతో వెళ్లిపోయారు.
డీజీపీ ఏం చర్య తీసుకుంటారు:
అమరావతి: విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని దుర్భాషలాడిన మంత్రి అప్పలరాజుపై డీజీపీ ఏం చర్యలు తీసుకుంటారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నిలదీశారు. ‘మంత్రి అయితే కళ్లు నెత్తికెక్కుతాయా? పోలీస్ అధికారుల సంఘం ఏం చేస్తోంది?’