ఏపీలో నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం


ఏపీ ప్రభుత్వంలోని పలు శాఖలలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ
విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.

ఉద్యోగ నోటిఫికేషన్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ, చిత్తూరు, కడప, విజయనగరం వంటి ప్రాంతాల్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనల్లో పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత, పీవైఎల్‌ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, రాష్ట్రంలో వేలాదిగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల రాష్ట్రంలో పదవీ విరమణ వయస్సును 62కు పెంచడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.