ఏపీని విభజించి.. కాంగ్రెస్ చేసిన తప్పులో బీజేపీకి భాగం లేదా? 


ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి.. మోడీకి.. కాంగ్రెస్ గుర్తుకు వచ్చింది. ఆయన చేపట్టిన పథకాలు.. సంక్షేమం వంటి కంటే ..కూడా కాంగ్రెస్ పాలన ఆయనకు గుర్తుకు రావడం .. గమననార్హం. మరీముఖ్యంగా ఆయనకు మరోసారి ఏపీ విభజన అంశం బాగా గుర్తుకు రావడమే ఇప్పుడు .. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ అశాస్త్రీయంగా ఏపీని విభజించిందని అన్నారు. అంతేకాదు.. పార్లమెంటు తలుపులు మూసి..పెప్పర్ స్ప్రే చేసి రాష్ట్రాన్ని విభజించారని దుయ్యబట్టారు. అందుకే.. ఇప్పటికీ.. ఏపీ తెలంగాణలు అనేక కష్టాలు పడుతున్నాయని కామెంట్ చేశారు.  బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ.. వరుస పెట్టి కాంగ్రెస్ను కార్నర్ చేస్తున్నారు. సోమవారం సాయంత్రి లోక్సభలో విరుచుకుపడ్డ ఆయన మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. సరే.. మోడీ మాటకే వస్తే.. ఏపీని విభజించి.. కాంగ్రెస్ చేసిన తప్పులో బీజేపీకి భాగం లేదా?  అప్పట్లో బీజేపీ పెద్దలుగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయకుడు.. ఇదే సభలోఉన్నారు కదా..!  అదేసమయంలో దివంగత సుష్మా జీ ఉన్నారు కదా! మరి వారు ఏం చేశారు.  అంతేకాదు.. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం మాకు కూడా ఉందని.. సోనియా.. తెలంగాణకు అమ్మ అయితే.. సుష్మా చిన్నమ్మ అని.. ప్రచారం చేసుకున్న విషయం మోడీకి తెలియదా?  తెలియకపోతే ..చెప్పేవారు లేరా?  నిజంగా ఆ రోజు పార్లమెంటును మూసేసి చేసిన తీర్మానం.. నిజమే. తర్వాత.. ఇంత కాలం మోడీ జీ ఏం చేశారు. దాదాపు ఏడున్నర సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నారు. ఇటుఏపీనుంచి అటు తెలంగాణ నుంచి విభజన సమస్యలు పరిష్కరించండి మహప్రభో అంటే.. పట్టించుకున్న పాపాన పోయారా? అసలు ఈ రెండు రాష్ట్రాలు దేశంలో ఉన్నాయనే విషయాన్ని ఏ నాడైనా గుర్తించారా? అంటే.. ఏం చెబుతారు?  మోడీ సర్!  విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చని ఘనత మీది కాదా..అని ప్రజలు నిలదీస్తుంటే.. ఎక్కడ వింటున్నారు?  ఏపీకి ప్రత్యేక హోదా అలాగే వెనుకపడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాల్లో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది ఎవరు?  తెలంగాణలో రైలు ప్రాజెక్టులు ఎయిమ్స్ వంటివి ఇస్తామని.. హామీ ఇచ్చారు. ఇప్పుడు వీటిపై కనీసం పన్నెత్తు వ్యాఖ్య చేస్తున్నారా?  ఈ తప్పులు జరుగుతున్నది మీ హయాంలో కదా.. మీరు చేస్తున్నవి కాదా?  అందుకే బీజేపీకి ఏపీలో ఆదరణ కరువైంది. కాంగ్రెస్ అన్యాయం చేయడం వల్లే నామరూపాల్లేకుండా పోయింది. మరి తానెందుకు బలపడలేదో బీజేపీ పెద్దలు ముఖ్యంగా మోడీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ది గతించిన చరిత్ర. ఏపీలో పాగా వేయాలని కలలు కంటున్న బీజేపీ న్యాయం చేయాలనే అంశాన్ని మరిచిపోతే ఎలా? అదేసమయంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చేయడం కాయమని అంటున్న వారికి ఇక్కడి విభజన హామీలు నెరవరే్చాలని లేకపోవడం.. ఏమాత్రం సమంజసం అవుతుంది?  ఏతావాతా ఎలా చూసినా.. కాంగ్రెస్ తానులోనే బీజేపీకూడా ఉందనే వాదన వినిపిస్తోంది.