ఈడీ కోర్టులో గుడివాడ ‘క్యాసినో’


గుడివాడ కేసినో. కొడాలి నాని కేసినో. గుడివాడ‌లో గోవా క‌ల్చ‌ర్‌. ఈ సంక్రాంతికి కేసినో మేట‌ర్ దుమ్ము దుమారం రేపింది. మూడు రోజుల్లోనే వంద‌ల కోట్లు చేతులు మారాయంటున్నారు. కె క‌న్వెన్ష‌న్‌లో కేసినోతో పాటు పేకాట‌, గానాభ‌జానా, చీర్ గాల్స్‌, మందు, విందు, చిందు.. అబ్బో.. గుడివాడ‌లో గోవాను దింపేశారు. మ‌స్త్ మ‌స్త్ మ‌జా చేశారు. క‌ట్ చేస్తే.. కొడాలి నాని కేసినో య‌వ్వారం రాజకీయంగా కాక రేపింది. నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటానంటూ నాని స‌వాల్ చేశారు. స‌రే నిరూపిస్తామంటూ టీడీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ గుడివాడ వెళితే.. వైసీపీ మూక‌లు రాళ్ల దాడి చేసి ర‌చ్చ రంబోలా చేశారు. గుడివాడ‌లో తేల‌క‌పోతేనేం.. ఢిల్లీలో తేల్చుకునే ప‌నిలో ప‌డ్డారు టీడీపీ నేత‌లు. ఇప్ప‌టికే రాజ్య‌స‌భ‌లో గుడివాడ కేసినో అంశాన్ని ప్ర‌స్తావించారు టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల‌. లేటెస్ట్‌గా.. వంద‌ల కోట్ల లావాదేవీలు న‌డిచిన‌ కేసినో అంశాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లింది టీడీపీ. ఢిల్లీలోని ఈడీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నేత‌లు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఈడీ అధికారులను కలిశారు. క్యాసినో వ్యవహారంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. ఏపీలో అధికార పార్టీకి చెందిన మంత్రి.. గోవా నుంచి గుడివాడకు యువతులను తీసుకొచ్చి సంప్రదాయాలను నట్టేట ముంచారని నేతలు ఆరోపించారు. దీనిపై ఈడీ విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటపడతాయన్నారు. అరాచక శక్తులకు చెక్‌ పెట్టాల్సిన బాధ్యత కేంద్ర సంస్థలపై ఉందన్నారు టీడీపీ నేత‌లు.